గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : గురువారం, 19 నవంబరు 2020 (08:44 IST)

తుంగభద్ర పుష్కరాలకు జగన్‌

తుంగభద్ర పుష్కరాలకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రానున్నారు. ఈ మేరకు మంగళవారం ఆయన పర్యటన ఖరారైంది. ఈ నెల 20న కర్నూలులోని సంకల్‌భాగ్‌ పుష్కర ఘాట్‌ను సందర్శిస్తారు. సీఎం పర్యటన నేపథ్యంలో అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు.

కోవిడ్‌ నిబంధనలకు అనుగుణంగా పర్యటన సాగేలా చర్యలు తీసుకుంటున్నారు. సీఎం సందర్శించే సంకల్‌భాగ్‌ (వీఐపీ) పుష్కర ఘాట్‌లోకి ఆయన పర్యటన సమయంలో జిల్లాకు చెందిన మంత్రులు, ప్రజాప్రతినిధులను తప్పా ఇతరులెవరినీ అనుమతించకూడదని నిర్ణయించారు. సీఎం తిరిగి వెళ్లిన తరువాతే ఇతరులను ఘాట్‌లోకి అనుమతిస్తారు.

ఓర్వకల్లు ఎయిర్‌పోర్టు, ఏపీఎస్పీ బెటాలియన్‌లో ముఖ్యమంత్రిని కలిసేందుకు కొద్దిమందికి అవకాశం కల్పించనున్నారు. సీఎం వైఎస్‌ జగన్‌ పర్యటన విజయవంతం చేసేందుకు  అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్‌ జి.వీరపాండియన్‌ ఆదేశించారు.

మంగళవారం సునయన ఆడిటోరియంలో ఎస్పీ డాక్టర్‌ కె.ఫక్కీరప్ప, జేసీలు ఎస్‌.రామసుందర్ ‌రెడ్డి, సయ్యద్‌ ఖాజా మొహిద్దీన్‌తో కలిసి తుంగభద్ర పుష్కరాలపై సమీక్షించారు. పుష్కరాలకు సీఎం వస్తున్నందున ప్రత్యేక ఏర్పాట్లు చేయాలన్నారు. పెండింగ్‌ పనులన్నీ బుధవారం సాయంత్రంలోపు పూర్తి చేయాలన్నారు. సమావేశంలో డీఆర్వో బి.పుల్లయ్య, కేఎంసీ కమిషనర్‌ డీకే బాలాజీ, సబ్‌ కలెక్టర్‌ కల్పనా కుమారి పాల్గొన్నారు.

సీఎం పర్యటన ఏర్పాట్లలో భాగంగా మంగళవారం సాయంత్రం కలెక్టర్‌ వీరపాండియన్‌, జాయింట్‌ కలెక్టర్‌ రామసుందర్‌ రెడ్డి, నగరపాలక కమిషనర్‌ డీకే బాలాజీతో కలిసి నగరంలోని ఏపీఎస్పీ బెటాలియన్‌లో హెలిప్యాడ్, సంకల్‌భాగ్‌ ఘాట్‌ను పరిశీలించారు. అలాగే  బెటాలియన్‌ నుంచి కొత్తబస్టాండ్, బంగారు పేట, ఎస్టీబీసీ కళాశాల, మున్సిపల్‌ కార్పొరేషన్‌ కార్యాలయం, నరసింగరావు పేట మీదుగా సంకల్‌భాగ్‌లోని పుష్కరఘాట్‌ వరకు సీఎం వెళ్లే దారిని చూశారు.

సంకల్‌భాగ్‌ పుష్కర ఘాట్‌లో ముఖ్యమంత్రి చేయనున్న పూజలకు సంబంధించిన ఏర్పాట్లు చూడాలని నగరపాలక కమిషనర్‌ను ఆదేశించారు.    
 
పర్యటన సాగేదిలా....
ఉదయం 11 గంటలు: తాడేపల్లిలోని ఇంటి నుంచి గన్నవరం ఎయిర్‌పోర్టుకు బయలు దేరుతారు. 
11.20: గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. 
11.30: గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి  ప్రత్యేక విమానంలో ఓర్వకల్లుకు బయలుదేరుతారు. 
12.30: ఓర్వకల్లు ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. 
12.40 –12.55 : ఓర్వకల్లు విమానాశ్రయం నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి కర్నూలు ఏపీఎస్పీ బెటాలియన్‌కు చేరుకుంటారు. 
మధ్యాహ్నం 1 గంట : ఏపీఎస్పీ బెటాలియన్‌ నుంచి రోడ్డుమార్గాన సంకల్‌భాగ్‌ పుష్కర ఘాట్‌కు బయలు దేరుతారు. 
1.10: సంకల్‌భాగ్‌కు చేరుకుంటారు 
1.10 – 1.50 : పుష్కర ఘాట్‌లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. 
1.50– 2.00 : సంకల్‌భాగ్‌ నుంచి బయలుదేరి బెటాలియన్‌కు చేరుకుంటారు. 
2.05– 2.20 : బెటాలియన్‌ నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి ఓర్వకల్లు ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. 
2.30: ఓర్వకల్లు నుంచి ప్రత్యేక విమానంలో విజయవాడకు బయలుదేరి వెళతారు.