శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : సోమవారం, 16 నవంబరు 2020 (20:20 IST)

పోలవరంపై అఖిలపక్షం వేయండి.. సీఎం జగన్ లక్ష్యం అదే..? సీపీఐ రామకృష్ణ

Ramakrishna
* ప్రాజెక్టు ఎత్తు తగ్గిస్తే జాతీయస్థాయిలో ఉద్యమం 
* అమరావతి, పోలవరం నాశనమే జగన్ లక్ష్యం 
* కీలక ప్రాజెక్టులను అభివృద్ధి చేయలేనప్పుడు ప్రభుత్వమెందుకు?
* ఖజానాలో డబ్బులు ఖాతాల్లో వేయడానికా? 
* సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ
 
రాష్ట్రానికి అత్యంత కీలకమైన అమరావతి, పోలవరం ప్రాజెక్టులను నాశనం చేయడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ మండిపడ్డారు. విజయవాడ దాసరి భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు రావుల వెంకయ్య, ఆక్కినేని వనజలతో కల్సి రామకృష్ణ మాట్లాడుతూ ఇప్పటివరకు అమరావతి రాజధాని ప్రాంతాన్ని విధ్వంసం చేయడమే పనిగా పెట్టుకున్న సీఎం ఇప్పుడు పోలవరం లక్ష్యాన్ని కూడా నీరుగార్చేలా రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నారని విమర్శించారు.
 
ప్రత్యక్షంగా, పరోక్షంగా రాష్ట్రంలోని అన్ని జిల్లాల ప్రజలకు త్రాగు, సాగునీటి కొరతను తీర్చే పోలవరం ప్రాజెక్టు విషయంలో కేంద్ర ప్రభుత్వం, తెలంగాణా సీఎం కేసీఆర్ మాటలు విని సీఎం జగన్ రాజీపడితే రాష్ట్రానికి తీరని అన్యాయం జరుగుతుందన్నారు. ప్రాజెక్టు డిజైన్ ప్రకారం ద్యామ్ ఎత్తును 150 అడుగుల నుంచి 135కి కుదించడం వల్ల 194 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం 115 టీఎంసీలకు తగ్గిపోతుందన్నారు. దీనివల్ల రాష్ట్రానికి జల జీవం లాంటి ప్రాజెక్టు లక్ష్యం పూర్తిగా నీరుగారుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.
 
కృష్ణా-గోదావరి నదుల అనుసంధానం పోలవరంతోనే సాధ్యమని, తద్వారా కృష్ణా జలాలను రాయలసీమ ప్రాంతానికి తరలించే అవకాశం ఏర్పడుతుందన్నారు. అలాగే ఉత్తరాంధ్ర ప్రాంతానికి విశాఖ నగర వాసులకు తాగునీటి అవసరాల నిమిత్తం గ్రావిటీ ద్వారా 22 టీఎంసీల నీటి తరలింపుకు ఈ ప్రాజెక్టు దోహదపడుతుందన్నారు అటువంటి కీలక ప్రాజెక్టు విషయంలో ప్రభుత్వ రాజీ ధోరణి, నిర్లక్ష్య వైఖరి సరికాదన్నారు. దీనిపై ఈ నెల 22న అన్ని రాజకీయ పార్టీలు రైతు సంఘాల నేతలతో పోలవరం ప్రాజెక్టును సందర్శిస్తామని, తదుపరి సదస్సు నిర్వహించి కార్యాచరణ ప్రకటిస్తామని పేర్కొన్నారు. 
 
ఎట్టి పరిస్థితుల్లో పోలవరం ప్రాజెక్టు డిజైన్లలో మార్పును సహించబోమని, అవసరమైతే దీనిపై జాతీయ స్థాయిలో ఉద్యమిస్తామని రామకృష్ణ హెచ్చరెంచారు. ఈ విషయంలో సీఎం జగన్ కూడా తన వైఖరి మార్చుకోవాలని సూచించారు. ఇప్పటివరకు అమరావతి రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రభుత్వానికి సంబంధం లేని అంశమన్నట్లుగా ముఖ్యమంత్రి వ్యవహరిస్తూ, దానిని ధ్వంసం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారని, ప్రస్తుతం అంతకంటే ముఖ్యమైన పోలవరం విషయంలోనూ ఆయన ధోరణి అలాగే కనిపిస్తుందన్నారు. 
 
రాష్ట్రానికి అత్యంత కీలకమైన ఈ రెండు ప్రాజెక్టుల ప్రయోజనాలను కాపాడి అభివృద్ధి చేయలేనప్పుడు ఇక నీ ప్రభుత్వమెందుకు ? అంటూ రామకృష్ణ ముఖ్యమంత్రిని సూటిగా ప్రశ్నించారు. ప్రభుత్వ ఖజానాలో ఉన్న డబ్బులు లభిచారుల ఖాతాల్లో వేయడానికా ?... అదే అయితే ఆ పని అధికారులు కూడా చేయగలరని ఎద్దేవా చేశారు. దీనిపై ముఖ్యమంత్రి తక్షణమే అన్ని రాజకీయపార్టీల నేతలతో అభిలపక్ష సమావేశం నిర్వహించి ప్రాజెక్టు చేర్పులు, మార్పులపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.
 
 
 
ఓట్లేసిన వారిని వేధిస్తూ స్వాములకు భజనలా?
 
వైసీపీకి ఓట్లు వేసి జగన్ ముఖ్యమంత్రి కావడానికి దోహదపడిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలపై దాడులు, దొర్జన్యాలు చేసి అక్రమ కేసులతో వేధిస్తూ, యాగం చేశాడన్న కారణంతో స్వరూపానంద స్వామికి జగన్ ప్రభుత్వం భజన చేయడం దారుణమని రామకృష్ణ విమర్శించారు. 
 
స్వరూపానంద పుట్టిన రోజు పురస్కరించుకొని రాష్ట్రంలోని అన్ని ముఖ్య దేవాలయాల్లో ప్రత్యేక పూజలు చేయాలని సాక్షాత్తూ దేవాదాయశాఖ ఉత్తర్వులివ్వడం శోచనీయమన్నారు. ఆయన మీద అభిమానముంటే జగన్ వ్యక్తిగతంగా ఏం చేసినా ఫర్వాలేదు గాని సంప్రదాయాలు తుంగలో తొక్కి ప్రభుత్వం ఆయనకు లొంగిపోయేలా వ్యవహరించడం సరికాదన్నారు. దీనిపై దేవాదాయశాఖ తక్షణమే తన ఉత్తర్వులు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. 
 
 
 
కేంద్ర ఆర్థిక ప్యాకేజీలన్నీ పారిశ్రామికవేత్తల కోసమే...
 
కరోనా లాక్‌డౌన్ సందర్భంగా కుదేలైన ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఆర్థిక ప్యాకేజీలన్నీ పారిశ్రామిక వేత్తలకు మేలు చేయడానికి తప్ప ఏ ఒక్క సామాన్యుడికి ఉపయోగపడలేదని ఆయన దుయ్యబట్టారు. రాష్ట్ర ప్రభుత్వాలు రాజకీయ పక్షాలతో కనీస సంప్రదింపులు జరపకుండా కేంద్రం ఏకపక్ష నిర్ణయాలతో ప్యాకేజీలు ప్రకటించి, వాటిని అద్భుతం, ఆమోఘమంటూ వారికి వారే జబ్బలు చరుచుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. 
 
కేంద్ర ప్యాకేజీలతో ఈ దేశంలో గాని, లేదంటే బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనైనా పేదల్లో ఏ ఒక్కరికైనా మేలు జరిగిందా? సమాధానం చెప్పాలని రామకృష్ణ సవాల్ విసిరారు. ఇప్పటికైనా కేంద్రం పునరాలోచన చేసి లాక్‌డౌన్‌లో ఉపాధి కోల్పోయిన కార్మికులు, కష్టజీవులు, వలస కూలీలు, నిరుద్యోగులు, గ్రామీణ పేదలను దృష్టిలో పెట్టుకొని ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలని రామకృష్ణ కోరారు.