చంద్రబాబు తప్పిదాల వల్లే పోలవరం అలా... వైసీపీ మంత్రి

minister anil
ఎం| Last Updated: మంగళవారం, 27 అక్టోబరు 2020 (11:09 IST)
'వాయించలేక మద్దెల ఓడన్నట్లు...' అన్న సామెత ఇప్పుడు సరిగ్గా వైసీపీ ప్రభుత్వానికి సరిపోయేలా వుంది. అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర అవుతున్నా..
ఇంకా గత టీడీపీ ప్రభుత్వం వల్లే అలా అయింది, ఇలా అయింది అంటుంటే జనం విరగబడి నవ్వుకుంటున్నారు.

పోలవరాన్ని అదిగో పూర్తి చేస్తున్నాం... ఇదిగో పూర్తి చేస్తున్నాం అంటూ డాంబికాలు పలికిన ఏపీ జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్.. కేంద్రం నుంచి సాయం అందకపోవడంతో.. ఆ తప్పు టీడీపీది అంటూ తప్పించుకోజూశారు. అయినా జనం మాత్రం అసలు విషయాన్ని ఇప్పుడిప్పుడే గ్రహించడం మొదలుపెట్టేశారు. ఇంతకీ ఆ మంత్రి గారు ఏమన్నారంటే...

పోలవరం అంచనా వ్యయంపై కేంద్రప్రభుత్వం విడుదల చేసిన ప్రకటనపై టిడిపి నేతలు సిగ్గులేకుండా మాట్లాడుతున్నారు. వైయస్‌ఆర్‌సిపి ప్రభుత్వానికి చేతకావడం లేదు, తమ హయాంలో అద్భుతంగా ప్రాజెక్ట్ నిర్మాణంకు నిధులను తీసుకురాగలిగామంటూ పచ్చి అబద్దాలు మాట్లాడుతున్నారు.

గత ఐదేళ్ళు సీఎంగా వున్న చంద్రబాబు, అప్పుడు మంత్రిగా వున్న దేవినేని ఉమల నిర్వాకం వల్లే నేడు పోలవరం ప్రాజెక్ట్ కు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ విషయాలను పూర్తి ఆధారాలతో సహా మేం ప్రజల ముందు వుంచుతున్నాం.

రాష్ట్ర విభజన సందర్బంగా పోలవరం ప్రాజెక్ట్ ను అప్పటి ప్రధాని స్వయంగా జాతీయ ప్రాజెక్ట్ గా ప్రకటించారు. కేంద్రమే పోలవరం నిర్మాణాన్ని చేపడుతుందని, ప్రతిపైసా కేంద్రమే భరిస్తుందని విభజన చట్టంలో పేర్కొన్నారు. అయితే కేంద్రం ఈ ప్రాజెక్ట్‌ను చేపడితే తనకు కమీషన్లు రావనే ఉద్దేశంతో చంద్రబాబు తామే పోలవరం నిర్మిస్తామంటూ ముందుకు వచ్చారు.

2014 నుంచి 2016 వరకు టిడిపి హయాంలో పోలవరంపై చేసిన వ్యయం కేవలం రూ.265 కోట్లు మాత్రమే. అప్పటి వరకు పోలవరంపై మొద్దు నిద్ర పోయిన టిడిపి ప్రభుత్వం 2016 సెప్టెంబర్ లో అప్పటి కేంద్రమంత్రి అరుణ్ జెట్లీ స్పెషల్ ప్యాకేజీ ప్రకటించిప్పుడు అర్థరాత్రి సంబంరాలు చేసుకుంది. దానిని సమర్థిస్తూ చంద్రబాబు అసెంబ్లీలో తీర్మానం పెట్టారు. దానిలో భాగంగా జరిగిన గూడుపుఠాని ప్రజలకు తెలియచేస్తున్నాం.

అసలు కేంద్రం ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీకి, పోలవరం నిర్మాణానికి ఎటువంటి సంబంధం లేదు. ప్యాకేజీ పరిధిలోకి పోలవరం ప్రాజెక్టును తీసుకురావడానికి వీలు లేదు. కానీ నాటి టిడిపి ప్రభుత్వం, తమ కమీషన్ల కోసం ప్యాకేజీకి అంగీకరించారు. 30.0.2016లో కేంద్రంలో తెలుగుదేశం భాగస్వామ్యంగా వుంది. ఆనాడు మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ రిలీజ్ చేసిన మెమోలో 2013-14 వరకు పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణంలో ఇరిగేషన్ కాంపోనెంట్ కు ఎంత వ్యయం అవుతుందో, దానిని మాత్రమే ఇస్తామని ప్రకటించింది.

దీనిని చంద్రబాబు సీఎంగా ఉండి అంగీకరించడం చారిత్రక తప్పిదం. ఇది తప్పు అని అటు అసెంబ్లీలోనూ జగన్ చెప్పారు, బయట కూడా అదే విషయాన్ని మేం చెప్పాం, అయినా చంద్రబాబు పట్టించుకోలేదు.

దేశంలో భారీ ఇరిగేషన్ ప్రాజెక్ట్‌లు చేపట్టినప్పుడు దశాబ్దాల సమయం పడుతుంది. ప్రారంభించిన తరువాత అంచనా వ్యయాలు కాలక్రమంలో పెరుగడం సహజం. పోలవరం విషయంలో కూడా అదే జరిగింది. రూ.20 వేల కోట్ల నుంచి టెక్నికల్ అడ్వయిజరీ బోర్డ్ ఇచ్చిన అంచనాల ప్రకారం వ్యయం రూ.55 వేల కోట్లకు వ్యయం పెరిగింది. ఈ రూ. 55 వేల కోట్ల లెక్కను తేల్చింది మూడు కేంద్ర ప్రభుత్వ విభాగాలే.

కేంద్ర ప్రభుత్వమే సహాయ, పునరావాస కార్యక్రమాలకు, భూమి పరిహారానికి సంబంధించిన లెక్కలు తన అధీనంలోని మూడు సంస్థలతో నిర్వహించింది. ఆ మూడు సంస్థలు చెప్పిన ప్రకారం అయినా ప్రాజెక్టు నిర్మాణ వ్యయాన్ని కేంద్ర
ప్రభుత్వమే ఇవ్వాలి.

రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్టు నిర్మాణంలో కేవలం ఫెసిలిటేటర్(సమన్వయకర్త) పాత్ర మాత్రమే పోషిస్తోంది. కాబట్టి నిర్మాణం ఖర్చు తగ్గినా, పెరిగినా అదంతా చట్ట ప్రకారం కేంద్ర ప్రభుత్వ బాధ్యతే. ఇందులో స్టేట్ కాంపొనెంట్, సెంట్రల్ కాంపొనెంట్ అంటూ ఉండవు. మొత్తంగా భరింంచాల్సింది కేంద్ర ప్రభుత్వమే. ఈ విషయం మీద మరో అభిప్రాయానికి అవకాశమే లేదు.

అయితే, 2017 మార్చిలో కేంద్ర కేబినెట్‌లో 2014 నాటి సవరించిన అంచనాల ప్రకారమే ఇరిగేషన్ కాంపోనెంట్‌ వ్యయంను కేంద్రం ఇస్తుందని తీర్మానం చేశారు. అప్పుడు కేంద్రమంత్రులుగా అశోక్ గజపతిరాజు, సుజనాచౌదరి వున్నారు. అంటే దీని అర్థం తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టిందనే కదా..!

కేంద్ర కేబినెట్‌లో 2014 తరువాత జరిగే అంచనా వ్యయాల పెరుగుదలను కేంద్రం భరించదని చాలా స్పష్టంగా నిర్ణయం చేశారు. చివరికి 2010-14 వరకు భూసేకరణ కోసం ఇచ్చిన అంచనాల మేరకే నిధులు ఇస్తామని చెప్పారు. దానికన్నా వయ్యం పెరిగితే కేంద్రంకు సంబంధం లేదని అన్నారు. దీనికి ఆనాడు సీఎంగా వున్న చంద్రబాబు ఒప్పుకున్నారు. ఇంతకుమించిన దుర్మార్గం ఉంటుందా..?

కేంద్రం ప్రకటించిన ప్యాకేజీకి సంబరాలు చేసుకుని, రాష్ట్రమే పోలవరం కట్టేస్తుంది అంటూ అర్థరాత్రి చంద్రబాబు ప్రకటనలు చేశారు. దీనిపైన 2018లో ప్రధానికి చంద్రబాబు రాసిన లేఖలో 30.9.2016 మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ రిలేజ్ చేసిన మెమో ప్రకారం పోలవరానికి తొందరగా డబ్బులు ఇవ్వాలని కోరడం వాస్తవం కాదా? ఆనాడు ఇరిగేషన్ కాంపోనెంట్ కోసం కేంద్రం ప్రతిపాదించింది రూ.20వేల కోట్లు. దానిని చంద్రబాబు సమర్థించారు.

దీర్ఘకాలం పనులు జరిగే భారీ ప్రాజెక్ట్ ల అంచనా వ్యయాలు పెరుగుతుంటాయి. సిడబ్ల్యుసీ సవరించిన అంచనాల ప్రకారం 48వేల కోట్ల రూపాయలు అంచనా వ్యయం. దీనిలో రూ.29వేల కోట్లు ఆర్‌అండ్‌ఆర్‌ కే ఖర్చు చేయాల్సి వుంది. ఇవ్వన్నీ కాదని ఆనాడు చంద్రబాబు ప్రభుత్వం కేంద్రం ప్రతిపాదించిన రూ.20వేల కోట్లకు ఎలా అంగీకరించింది? చంద్రబాబు ప్రభుత్వం ఆనాడు తీసుకున్న తప్పుడు నిర్ణయం వల్లే ఈ రోజు కేంద్రం దానిని ముందుకు తెచ్చింది.

పోలవరంపై కేంద్రం ప్రకటించిన అంచనా వ్యయాలను వైయస్‌ఆర్‌సిపి ప్రభుత్వం అంగీకరించదు. దీనిపై సీఎం వైయస్ జగన్ ప్రధానమంత్రికి లేఖ రాయబోతున్నారు. మేం కూడా ప్రధానిని కలిసి అన్ని వివరాలను అందించబోతున్నాం. చంద్రబాబు మాదిరిగా రాష్ట్రాన్ని అడ్డంగా ముంచే పని మేం చేయలేము. రాష్ట్రానికి వెన్నుపోటు పొడవడం మాకు తెలియదు. ఒకవైపు చేయాల్సిన తప్పులన్నీ చేసి, ఇప్పుడు ఈ ప్రభుత్వంపైన బురదచల్లుతున్నారు.

క్షమాపణలు చెప్పాల్సింది మేం కాదు, చంద్రబాబు, టిడిపి నేతలు ఈ రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలి. కేంద్రంతో రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీ పడినందుకు క్షమాపణలు చెప్పాలి.దీనిపై మరింత చదవండి :