శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Modified: సోమవారం, 16 నవంబరు 2020 (19:57 IST)

150 టన్నుల రొయ్యలు దొంగతనం, అడిగితే చంపేస్తామంటున్నారు, నన్ను సీఎం జగన్ కాపాడాలి

త‌న ఆస్తుల‌ను దౌర్జ‌న్యంగా లాక్కోవ‌డంతో పాటు చంపుతామ‌ని బెదిరిస్తున్నార‌ని త‌న‌కు ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి ర‌క్ష‌ణ క‌ల్పించాల‌ని క‌ర్ణాట‌క రాష్ట్రానికి చెందిన మ‌హిళా పారిశ్రామిక‌వేత్త ల‌క్ష్మీన‌ర‌సింహ‌న్ విజ్ఞ‌ప్తి చేశారు. ఈ సంద‌ర్భంగా గాంధీ‌న‌గ‌ర్‌లోని ఓ హోట‌ల్‌లో సోమ‌వారం ఏర్పాటు చేసిన విలేక‌రుల స‌మావేశంలో ఆమె మాట్లాడుతూ త‌న‌ది ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని కృష్ణాజిల్లా మ‌చిలీప‌ట్నం వాసినని తెలిపారు.
 
తను సుమారు మూడు ద‌శ‌బ్ధాల క్రితం వివాహం చేసుకుని క‌ర్ణాట‌కలో స్థిర‌ప‌డ్డామ‌ని, స్వ‌రాష్ట్రంలో ప‌లువురికి ఉపాధి క‌ల్పించే నిమిత్తం చేప‌ల చెరువును న‌డిపేందుకు గుడివాడ‌ స‌మీపంలోని నంద‌మూరులో 150 ఎక‌రాలు వ్యాపారం ప్రారంభించ‌డం కోసం నూక‌ల రామ‌కృష్ణ‌, నూక‌ల బాలాజీల‌ ద‌గ్గ‌ర‌ లీజుకు తీసుకోవ‌డం ‌జ‌రిగింద‌న్నారు. ఈ క్ర‌మంలో లాక్‌డౌన్‌ను ఆస‌రాగా తీసుకుని త‌న‌కు చేపల చెరువును లీజుకు ఇచ్చిన వ్య‌క్తులే రూ.60 వేలు కాదు రూ.90 వేలు డిమాండ్ చేయ‌డంతో చేసేది లేక అందుకు అంగీక‌రించి 2023 వ‌ర‌కు లీజు ఒప్పందం చేసుకోవ‌డం జ‌రిగింద‌న్నారు.
 
ఏప్రిల్ మాసంలో చేప‌ల‌ను విక్ర‌యించుకునేందుకు సిద్ధ‌మ‌వ్వ‌గా త‌న‌కు లీజుకు ఇచ్చిన వ్య‌క్తులే చాలా త‌క్కువ మొత్తానికి విక్ర‌యించాల‌ని డిమాండ్ చేయ‌డంతో అందుకు అంగీక‌రించ‌ని ప‌క్షంలో త‌న‌ను బెదిరించి దౌర్జ‌న్యంగా 150 ఎక‌రాల్లోని రొయ్య‌ల‌ను త‌ర‌లించుకు పోయార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. దీనిపై పోలీసుల‌కు ఫిర్యాదు చేసేందుకు ఎన్నోసార్లు తిరిగిన‌ప్ప‌టికీ క‌నీసం ఫిర్యాదును కూడా పోలీసులు స్వీక‌రించ‌లేద‌ని పేర్కొన్నారు.
 
స్పంద‌న కార్య‌క్ర‌మం ద్వారా రెండుసార్లు ఫిర్యాదు చేసిన‌ప్ప‌టికీ స్పంద‌న క‌రువైందని పేర్కొ‌న్నారు. ఈ నేప‌ధ్యంలో రెండోసారి కూడా ఇదే విధంగా త‌మ వ్యాపారాన్ని అడ్డుకుని సుమారు 150 ట‌న్నుల రొయ్య‌ల‌ను దొంగ‌త‌నంగా త‌ర‌లించుకుపోయార‌ని చెప్పారు. ఇక ఆ స‌మ‌యంలో త‌న‌కు తెలిసిన వారి ద్వారా డీజీపీ గౌతం స‌వాంగ్‌ని క‌లిసి విన్న‌వించుకోగా ఆయ‌న ప్ర‌త్యేక శ్ర‌ద్ధ తీసుకోవ‌డంతో పోలీసులు అక్టోబ‌రులో కేసు న‌మోదు చేశారు. త‌మ విచార‌ణలో తాను చెప్పిన విష‌యాల‌న్నీ వాస్త‌వాల‌ని తేలిన‌ప్ప‌టికీ నిందితుల‌ను అరెస్టు చేయ‌కుండా పోలీసులు తాత్సారం చేస్తున్నార‌ని తెలిపారు.
 
రాష్ట్రంలో ద‌ళితుల‌కు ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి న్యాయం చేస్తున్న క్ర‌మంలో త‌న గోడును ఆల‌కించి త‌న‌కు న్యాయం చేయాల‌ని సీఎం జ‌గ‌న్‌కు ఆమె విన్న‌వించుకున్నారు. ఒక మ‌హిళా పారిశ్రామిక‌వేత్త‌గా తా‌ను స్వ‌రాష్ట్రం మీద ప్రేమ‌తో ప‌లువురికి ఉపాధి క‌ల్పించ‌డం కోసం వ‌చ్చి వ్యాపారాన్ని నిర్వ‌హిస్తుంటే అన్ని విధాలుగా అడ్డుకోవ‌డంతో పాటు త‌న ఆస్తులు కాజేయ‌డంతో పాటు త‌న‌ను చంపుతామ‌ని బెదిరిస్తున్నార‌ని క‌న్నీటిప‌ర్యంత‌మ‌య్యారు. ఈ విష‌యంలో ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి మాత్ర‌మే త‌న‌కు న్యాయం చే‌స్తార‌ని త‌ద్వారా మరింత మంది మ‌హిళా పారిశ్రామివేత్త‌ల‌ను ప్రోత్స‌హిస్తార‌ని ఆమె కోరారు.