సోము వీర్రాజుకు మానవత్వం లేదు: టీడీపీ
నంధ్యాలలో సలాం కుటుంబం ఆత్మహత్య చేసుకున్న ఘటనపై రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు కన్నీరు పెట్టుకున్నారని, అన్ని రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు జరగినఘటన పట్ల మానవత్వంతో స్పందించాయని కానీ.. భాజపా అధ్యక్షుడు సోము వీర్రాజు మాత్రం ఏమాత్రం మానవత్వం లేకుండా మట్లాడడం ఆయన వ్యక్తిత్వానికి నిదర్శనమని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి షేక్ నాగుల్‌మీరా అన్నారు.
కేశినేని భవన్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నాగుల్‌మీరా మాట్లాడుతూ సలాం కుటుంబం ఆత్మహత్య చేసుకున్న కారణాన్ని సెల్ఫీ వీడియో ద్వారా సలాం కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారని, ఆ విషయాన్ని రాష్ట్ర ప్రజలందరూ చూసి చలించిపోయారని తెలిపారు. అయినప్పటికీ పోలీసులపై కేసులు పెడతారా అంటూ సోము వీర్రాజు పిచ్చిప్రేలాపనలు చేయడం దారుణమన్నారు.
పోలీసుల వేధింపులకు అన్యాయంగా ఓ కుటుంబం బలైతే ప్రభుత్వం డబ్బులు ఇచ్చి ఆదుకుంటుంది కదా అని మాట్లాడడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు.
సోము వీర్రాజు ఇప్పటికైనా మతతత్వ రాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు. ఇన్సూరెన్స్ కోసం ఎవరూ చచ్చిపోరని, రూ.10 కోట్లు ఇన్యూరెన్స్ ఇస్తే సోము వీర్రాజు ఆత్మహత్య చేసుకుంటారా అని ప్రశ్నించారు.
ప్రజా వ్యతిరేఖ విధానాలపై మొదట నుంచి తెలుగుదేశం పార్టీ పోరాడుతూనే ఉందన్నారు. దుర్గగుడిలో అమ్మవారి రథంలో సింహాలు మాయం అయినప్పుడు, అంతర్వేదిలో రథం కాల్చినప్పుడు, దిశపై జరిగిన హత్యాచారం వంటి ఘటనలపై తెలుగుదేశం పార్టీ పోరాడిందని గుర్తు చేశారు.
తెలుగుదేశం పార్టీ పుణ్యమా అని ఎమ్మెల్సీ అయిన సోము వీర్రాజు ఇప్పటివరకు తెలుగుదేశం పార్టీని విమర్శిస్తూ విషం చిమ్మతున్నాడని ఆరోపించారు. సలాం కుటుంబం ఆత్మహత్య ఘటనను వెంటనే సీబీఐకి అప్పగించాలని అప్పటివరకు తెలుగుదేశం పార్టీ పోరాటం చేస్తూనే ఉంటుందని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
లేనిపక్షంలో తెలుగుదేశం పార్టీ న్యాయ పోరాటం చేస్తుందని హెచ్చరించారు. రాష్ట్రంలో సోము వీర్రాజు మాటలకు విలువ లేదన్నారు. సలాం కుంటుంబం ఆత్మహత్య జరిగిన ఘటన జరిగిన 12 గంటల్లోనే నిందితులకు బెయిల్ రావడం కేవలం ఈ ప్రభుత్వంలోనే జరిగిందని తెలిపారు.
అవసరమైతే తెదేపా న్యాయ స్థానాన్ని ఆశ్రయించైనా సరే నిందితులకు శిక్ష పడే వరకు వదిలిపెట్టేది లేదని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో ఫేతావుల్లా, ఇర్ఫాన్,అన్సార్, తాజుద్దీన్, ఫైజన్, హాబీబ్,నూర్ తదితరులు పాల్గొన్నారు.