సోమవారం, 25 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సిహెచ్
Last Modified: సోమవారం, 26 జులై 2021 (21:09 IST)

చేనేతల అభ్యున్నతికి తుదివరకు శ్రమించిన ప్రగడ: ఆప్కో ఛైర్మన్ చిల్లపల్లి మోహనరావు

చేనేతల అభ్యున్నతి కోసం తుదికంటా శ్రమించిన ప్రజాబంధు ప్రగడ కోటయ్య ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆప్కో చైర్మన్ చిల్లపల్లి వెంకట నాగ మోహనరావు పిలుపునిచ్చారు. అఖిల భారత చేనేత ఉద్యమనేత, మాజీ పార్లిమెంటు సభ్యుడు, చేనేత కీర్తి పతాక ప్రగడ కోటయ్య 106వ జయంతిని పురస్కరించుకొని విజయవాడలోని ఆప్కో కేంద్ర కార్యాలయంలో సోమవారం ప్రగడ కోటయ్య చిత్రపటానికి ఛైర్మన్ మోహనరావు, అధికారులు, సిబ్బంది పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
 
ఈ సందర్భంగా ఆప్కో ఛైర్మన్ మోహనరావు మాట్లాడుతూ ఒకప్పుడు స్వర్ణయుగాన్ని చూసి, ఒకానొక దశలో కనీవినీ ఎరుగని రీతిలో ఇబ్బందులు ఎదుర్కున్న చేనేత రంగాన్ని తన అలుపెరుగని ఉద్యమాల ద్వారా తిరిగి జవసత్వాలు తీసుకు వచ్చిన మహానుభావుడు శ్రీ ప్రగడ కోటయ్య అన్నారు. రైతు బాంధవులు ప్రొఫెసర్‌ ఎన్‌.జి. రంగా శిష్యునిగా ఉంటూ మద్రాసు టెక్స్‌టైల్‌ కళాశాలలో శిక్షణ పొంది చేనేత సహకార రంగంలో ఉద్యోగంలో చేరి సహకార రంగ వృద్ధికి ఎనలేని కృషి చేశారన్నారు. చేనేత వాణి అనే వారపత్రిక ద్వారా చేనేతల సమస్యలను రాష్ట్రమంతటా వినిపించారని గుర్తుచేశారు. 1952లో ఉమ్మడి మద్రాసు శాసనసభసభ్యుడిగా చేనేత వృత్తి పరిరక్షణకు ప్రగడ కోటయ్య ఎంతగానో కృషి చేశారన్నారు. 1950లో 75 రోజుల పాటు సత్యాగ్రహం నిర్వహించి, జైలు శిక్ష అనుభవించారన్నారు.
 
1953లో టంగుటూరు ప్రకాశం పంతులు ప్రభుత్వం చేనేత నిల్వలు కొనుగోలు చేయాలనే డిమాండ్‌తో ఆయన ఉద్యమించారని గుర్తు చేశారు. 1952లో ఉమ్మడి మద్రాసురాష్ట్రంలో ప్రకాశం పంతులు స్థాపించిన కృషీకార్‌ లోక్‌ పార్టీ ద్వారా శాసనసభ్యునిగా అఖండ విజయం సాధించి, సాధారణ ఎన్నికలలో చీరాల నుంచి శాసన సభ్యునిగా, 1974 నుంచి 1980 వరకు శాసనమండలి సభ్యులుగా 1990లో రాజ్యసభ సభ్యునిగా ఎన్నికయ్యారన్నారు.
 
ప్రగడ కోటయ్య 70వ జన్మదినోత్సవం సందర్భంగా చీరాలలో బెజవాడ గోపాలరెడ్డి చేతుల మీదుగా ‘ప్రజా బంధు’ బిరుదు ప్రదానం చేశారన్నారు. యాభై శాతంగా ఉన్న పేద గ్రామీణ వృత్తిదారులను వెనుకబడిన వర్గాలుగా గుర్తించి చట్టసభలలో తగిన ప్రాతినిథ్యం కల్పించాలని ఆయన డిమాండ్‌ చేశారన్నారు.
 
 ఆంధ్రప్రదేశ్‌లో చేనేత రంగానికి సరసమైన ధరలకు నూలు అందించాలనే ఉద్దేశంతో 11 చోట్ల సహకార నూలు మిల్లులు స్థాపింపచేశారన్నారు. జీవితాంతం బడుగు బలహీనవర్గాల అభ్యున్నతికి అవిశ్రాంత పోరాటం చేసిన ప్రగడ కోటయ్య చేనేత రంగ అభ్యున్నతికి స్ఫూర్తి ప్రదాతగా నిలిచారని మోహనరావు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆప్కో జీఎం లేళ్ల రమేష్ బాబు, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.