యుద్ద పరికరాల తయారీలో భారత్ టాప్!
భారత దేశ రక్షణతో పాటు దేశ ప్రజా ఆరోగ్య పరిరక్షణకు మన దేశం ఎనలేని కృషి చేస్తోందని డిఆర్ డి ఓ చైర్మన్ డాక్టర్ సతీష్ రెడ్డి అన్నారు. యుద్ద పరికరాల తయారీలో అగ్రదేశాల సరసన భారత్ చేరిందని కొనియాడారు. యుద్ధ అస్త్రశస్త్రాలు తయారీలో ప్రపంచంలో అమెరికా, చైనా, రష్యా వంటి అగ్రదేశాల సరసన భారత్ చేరిందంటూ భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (డి ఆర్ డి ఓ) చైర్మన్ డాక్టర్ జి సతీష్ రెడ్డి సగర్వంగా చెప్పారు.
కృష్ణా జిల్లా రచయితల సంఘం ఆధ్వర్యంలో హోటల్ ఐలాపురం సమావేశ మందిరంలో జరిగిన ఆత్మీయ సమావేశంలో ఆయన ప్రసంగించారు. కరోనా వ్యాక్సిన్‌కు ప్రతిగా తమ శాస్త్రవేత్తలు రూపొందించిన "2 డీజి" మందును ప్రజలకుర అందించేందుకు 18 ఫార్మా కంపెనీలకు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించామన్నారు.
ఇప్పటికే ఆరు కంపెనీలు ఉత్పత్తి ప్రారంభించి క్రమేణా విదేశాలకు ఎగుమతి చేసే స్థాయికి చేరుకోగలవన్న విశ్వాసం తమకు ఉందన్నారు. భారత ప్రధాని నరేంద్రమోడీ ప్రోత్సాహంతో కేవలం వారం పది రోజుల్లోనే ఇప్పటికే 16 కేంద్రాల్లో వెయ్యి పడకల ఆసుపత్రి ప్రారంభించి జిల్లాస్థాయి వరకు ఆక్సిజన్ ప్లాంట్ల ఏర్పాటుకు చర్యలు చేపట్టామన్నారు.
తాజాగా ఇంటి నుంచే తగు చికిత్స కోసం 10 కేజీల ఆక్సిజన్ సిలిండర్ లను రాత్రి పగలు ఉత్పత్తి చేస్తున్నామని డాక్టర్ సతీష్ రెడ్డి చెప్పారు. గతంలో యేడాదికి 40 వేల పీపీఈ కిట్ల ఉత్పత్తి సాగితే ప్రస్తుతం రోజుకు పది లక్షల కిట్ల ఉత్పత్తి చేస్తున్నామన్నారు. ఈ అంశాలన్నింటి పై ప్రతి రెండు వారాలకు ఒకసారి భారత ప్రధాని స్వయంగా సమీక్ష జరుపుతున్నారని అన్నారు.
కృష్ణా జిల్లా నాగాయలంక మండలం గొల్లలమంద గ్రామంలో ప్రస్తుతం వెయ్యి మంది శ్రామికులతో క్షిపణి కేంద్ర నిర్మాణం పనులు చురుగ్గా సాగుతున్నాయని. అలాగే ఆ గ్రామాన్ని దత్తత తీసుకుని సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తామని అన్నారు.
శాసనసభ మాజీ ఉప సభాపతి మండలి బుద్ధప్రసాద్ మాట్లాడుతూ, తెలుగు వారైన ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, భారత ప్రధాన న్యాయమూర్తి నూతలపాటి వెంకటరమణ, అలాగే డి ఆర్ డి ఓ చైర్మన్ డాక్టర్ సతీష్ రెడ్డి వారివారి రంగాల్లో దేశ ప్రజల మన్ననలు పొందుతూనే, తెలుగు భాషకు తగు గుర్తింపు తెస్తున్నారంటూ కొనియాడారు. తెలుగు రచయితల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ జి.వి పూర్ణచంద్, డాక్టర్ జి సమరం, డాక్టర్ ఎం సి దాస్, డాక్టర్ పాలపర్తి శ్యామలానంద ప్రసాద్, రాష్ట్ర సమాచార కమిషనర్ ఐలాపురం రాజా తదితరులు పాల్గొన్నారు