గురువారం, 23 జనవరి 2025
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By సెల్వి

టోక్యో ఒలింపిక్స్ 2021లో నిరాశ.. చేతులెత్తేసిన షూటర్లు

shooting
భారత షూటర్ల బృందం టోక్యో ఒలింపిక్స్ 2021లో నిరాశ ఎదురైంది. 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్ ఈవెంట్లో మను బాకర్‌తో పాటు యశస్విని సింగ్ ఫైనల్‌కు అర్హత సాధించలేదు. మను బాకర్ పిస్టల్‌కు చెందిన ఎలక్ట్రానికి ట్రిగ్గర్‌లో సాంకేతిక లోపం ఎదురైంది. ఎయిర్ పిస్టర్ 10 మీటర్ల ఈవెంట్‌లో గంట 15 నిమిషాల వ్యవధిలో 60 షాట్లు కాల్చాల్సి ఉంటుంది. అయితే 16 షాట్లు పూర్తయ్యాక ట్రిగ్గర్‌లో లోపం వచ్చింది. 
 
నిబంధనల ప్రకారం అక్కడికక్కడే లోపాన్ని సరిచేసుకోవడానికి వీలుండదు. దీంతో పోటీ స్థలంనుంచి దూరంగా వెళ్లి పిస్టల్ సరి చేసుకొని తిరిగి వచ్చే సరికి దాదాపు 20 నిమిషాల సమయం వృధా అయ్యింది. తొలి 20 నిమిషాల్లో కేవలం 16 షాట్లు మాత్రమే పూర్తి చేసింది. మిగిలిన 44 షాట్లను కొట్టడానికి 55 నిమిషాల సమయం మాత్రమే మిగిలింది. దీంతో ఒత్తిడికి గురైన మను బాకర్ చివర్లో సరైన గురి పెట్టలేకపోయింది. 
 
త్వరత్వరగా షాట్లు కొట్టడానికి ప్రయత్నించి పాయింట్లు పోగొట్టుకుంది. ఐదో సిరీస్‌లో 98 పాయింట్ల కనుక సాధించి ఉంటే ఫైనల్ రౌండ్‌కు చేరుకునేది. కానీ కేవలం 95 పాయింట్లు మాత్రమే సాధించి 3 పాయింట్ల తేడాతో ఫైనల్ బెర్త్ కోల్పోయింది. టోక్యో ఒలింపిక్స్‌లో తప్పక పతకం సాధిస్తుందని మను బాకర్‌పై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కానీ పిస్టల్ రూపంలో ఆమెకు దురదృష్టం వెంటాడింది.