1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 24 జులై 2021 (15:31 IST)

ప్రైవేట్ వైద్య కాలేజీల్లోని సీట్లు కన్వీనర్ కోటా కింద భర్తీ : కేంద్రం

దేశంలోని ప్రైవేటు వైద్య కాలేజీల్లోని సీట్లలో 50 శాతం సీట్లను కన్వీనర్ కోటా కింద భర్తీ చేస్తామని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇందుకోసం త్వరలోనే జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష (నీట్)ను నిర్వహించనున్నట్టు తెలిపింది. 
 
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 558 ప్రభుత్వ, ప్రైవేట్ కాలేజీల్లో 83,275 ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది. ఈ సీట్ల భర్తీ కోసం త్వరలోనే నీట్ పరీక్ష నిర్వహించారు. ఈ నేపథ్యంలో కేంద్రం ఈ ప్రకటన చేసింది. 
 
ఇక తెలంగాణ రాష్ట్రంలో 5,240 ఎంబీబీఎస్ సీట్లు, 2,237 పీజీ సీట్లు ఉన్నట్లు ప్రకటించింది. 289 ప్రభుత్వ కాలేజీల్లో మొత్తం 43,435 ఎంబీబీఎస్ సీట్లున్నాయని కేంద్రం పేర్కొంది. 269 ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో 39,840 ఎంబీబీఎస్ సీట్లున్నాయన్నారు. 
 
ప్రభుత్వ కాలేజీల్లో ఉన్న మొత్తం సీట్లలో 15 శాతం(6,515) సీట్లు అన్ని రాష్ట్రాలు నేషనల్ పూల్‌కి ఇస్తాయని కేంద్రం ప్రకటించింది. ఈ సీట్లను జాతీయ స్థాయిలో మంచి ర్యాంకులు సాధించిన విద్యార్థులకు కేటాయించడం జరుగుతుంది.
 
తెలంగాణలో 34 ప్రభుత్వ, ప్రైవేట్ కాలేజీల్లో 5,240 ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయి. వాటిలో 11 ప్రభుత్వ కాలేజీల్లో 1,790 సీట్లు, 23 ప్రైవేట్ కాలేజీల్లో 3,450 ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయి. ఇక ప్రభుత్వంలోని సీట్లల్లో 15 శాతం అంటే 268 సీట్లు నేషనల్ పూల్‌లోకి వెళ్తాయి. 
 
ప్రైవేట్ కాలేజీల్లోని సీట్లల్లో 50 శాతం కన్వీనర్ కోటాకింద భర్తీ చేస్తారు. మిగిలిన 35 శాతం బీ కేటగిరీ కింద నిర్ణీత ఫీజుతో భర్తీ చేశారు. 15 శాతం సీట్లను ఎన్ఆర్ఎస్ఐ కోటా కింద తమకు ఇష్టమైన వారికి ప్రైవేట్ యాజమాన్యాలు కేటాయించుకోవడానికి వెలుసుబాటు ఉంది.