సోమవారం, 6 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 16 జులై 2021 (12:25 IST)

కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల పరిధిపై గెజిట్లు విడుదల

కృష్ణా, గోదావరి నదీ వినియోగంపై రెండు తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఈ సమస్య పరిష్కారం కోసం కేంద్రం చర్యలు చేపట్టింది. ఇందులోభాగంగా, కృష్ణా, గోదావ‌రి యాజ‌మాన్య బోర్డుల పరిధుల‌ను ఖరారు చేస్తూ గెజిట్ల‌ను కేంద్రం శుక్రవారం విడుద‌ల చేసింది. అక్టోబ‌రు 14 నుంచి ఈ గెజిట్ నోటిఫికేష‌న్ అమ‌లులోకి రానుంది. 
 
బ‌చావ‌త్ ట్రైబ్యున‌ల్ కేటాయింపులున్న ప్రాజెక్టుల‌న్నీ కృష్ణాబోర్డు ప‌రిధిలోకి వ‌స్తాయ‌ని కేంద్రం పేర్కొన్న‌ది. కృష్ణాన‌దిపై 36, గోదావ‌రిపై 71 ప్రాజెక్టుల‌ను ఈ బోర్డు ప‌రిధిలోకి తీసుకొచ్చింది. అనుమ‌తిలేని ప్రాజెక్టులు 6 నెల‌ల్లోగా అనుమ‌త‌ులు తెచ్చుకోవాల‌ని, ఒక‌వేళ అనుమ‌తులు రాకుంటే ప్రాజెక్టులు నిలిపివేయాల‌ని కేంద్రం స్ప‌ష్టం చేసింది. 
 
అలాగే, బోర్డుల‌కు ఛైర్మ‌న్లు, స‌భ్య‌కార్య‌ద‌ర్శి, చీఫ్ ఇంజ‌నీర్లు ఇత‌ర రాష్ట్రాల‌కు చెందిన‌వార‌ని, అన్ని ప్రాజెక్టుల నిర్వాహ‌ణ బోర్డులే చూసుకుంటాయ‌ని, ఒక్కోరాష్ట్రం ఒక్కో బోర్డుకు రూ.200 కోట్లు చోప్పున డిపాజిట్ చేయాల‌ని, సీడ్ మ‌నీ కింద 60 రోజుల్లో ఈ మొత్తాన్ని డిపాజిట్ చేయాల‌ని కేంద్రం తెలిపింది. ఇక నిర్వాహ‌ణ ఖ‌ర్చుల‌కు నిధులను అడిగిన 15 రోజుల్లోపు చెల్లించాల‌ని కేంద్రం స్ప‌ష్టం చేసింది.