శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 26 జులై 2021 (09:18 IST)

కార్గిల్ వార్‌లో భారత సైన్యం తెగువకు 22 వసంతాలు

ప్రపంచంలోని దేశాలతో పోల్చితే భారత్ శాంతికాముక దేశం. శత్రు దేశాలతోనూ స్నేహస్వభావంతో మెలగాలన్న భావన కలిగిన దేశం. అలాంటి భారత భూభాగంలోకి ఎవరైనా చోరబాటుకు యత్నిస్తే మాత్రం ఏమాత్రం సహించదు. చెంపపెట్టులాంటి సమాధానంతో బదులిస్తుంది. ఈ విషయంలో భారత్ సైన్యం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 
 
తాజాగా సరిహద్దులో డ్రాగన్ దురాక్రమణను దుయ్యబట్టి.. చేతలతోనే చైనాకు గట్టిగా బుద్ధిచెప్పింది. ఇలా బుద్ధిచెప్పటం, అవసరమైతే బాంబులతో బదులు చెప్పటం దేశానికి కొత్తేమి కాదు. 22 ఏళ్ల క్రితమే దురాక్రమణలకు పాల్పడ్డ దాయాది దేశమైన పాకిస్థాన్‌ను.. రణక్షేత్రంలో మట్టికరిపించి తిరిగి మన భూభాగాల్ని సొంతం చేసుకున్న ఘనత ఉంది. 
 
నాడు జరిగిన కార్గిల్ యుద్ధంలో భారత సైన్యం తెగువకు.. చావు తప్పి కన్ను లొట్టబోయిన పాక్ తోకముడిచింది. అక్రమంగా తిష్టవేసిన ప్రాంతాలను తిరిగి అప్పగించింది. ఆ కష్ట సమయంలో.. క్లిష్టమైన వాతావరణంలో భారత సైన్యం చూపిన తెగువ, పరాక్రమానికి 22ఏళ్లు నిండుతున్నాయి. 
 
జులై 26 కార్గిల్ విజయ్ దివస్.. కోట్లాది మంది భారతీయుల హృదయాలు విజయగర్వంతో, దేశభక్తితో పులకించిపోయే రోజు. దాయాది పాకిస్థాన్పై అసామాన్య విజయం సాధించిన సందర్భం. యావత్ భారత పౌరులు.. దేశభక్తితో జైజవాన్ అని నినదించే రోజు. భరతమాతపై దాడికి వచ్చిన ముష్కరమూకను సైన్యం తోకముడుచుకునేలా చేసిన రోజిది. 
 
1999లో భారత్లోకి చొరబడి మంచుకొండలపై మాటు వేసి దొంగ దెబ్బ తీయాలన్న పాక్ పన్నాగాన్ని సమర్థంగా ఎదుర్కొని.. ఆ దేశాన్ని చావుదెబ్బ కొట్టిన అద్భుత ఘట్టం. అలా అసామాన్య రీతిలో కార్గిల్ వేదికగా జరిగిన యుద్ధంలో భారత్ విజయం సాధించి నేటికి 22 ఏళ్లు. కార్గిల్ యుద్ధంలో దేశం కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరులను మరోసారి మననం చేస్కోవాల్సిన సమయం. వారి పోరాట పటిమ, త్యాగశీలతనూ స్మరించుకోవాల్సిన సందర్భమిదే.