సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 29 జులై 2021 (11:04 IST)

రూ.4 కోట్ల మేరకు కుచ్చుటోపీ పెట్టిన మాజీ సైనికుడు

ఏపీలోని ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలో ఓ మాజీ సైనికుడు చిట్టీల పేరుతో రూ.4 కోట్ల మేరకు కుచ్చుటోపీ పెట్టాడు. ఈ కేసులో బాధితుల ఫిర్యాదు మేరకు నిందితుడుని అరెస్ట్ చేశారు.
 
ఈ వివరాలను పరిశీలిస్తే, బేస్తవారపేట మండలం చిన్న ఓబినేనిపల్లె గ్రామానికి చెందిన కొంగలవీటి రమణారెడ్డి గతంలో సైన్యంలో పనిచేసి పదవీ విరమణ పొందారు. అనంతరం గిద్దలూరులో నివాసముంటున్నారు. తనకున్న పరిచయాలతో రూ.లక్ష నుంచి రూ.15 లక్షల విలువైన చిట్టీలను నిర్వహిస్తున్నాడు. 
 
ఈ క్రమంలో నెలవారీ వడ్డీ చెల్లిస్తానంటూ చిట్టీలు వేసినవారు, ఇతర మాజీ సైనికుల వద్ద నగదు తీసుకున్నారు. ఈ క్రమంలోనే క్రికెట్‌ బెట్టింగ్‌, జూదం, వ్యసనాలకు రమణారెడ్డి అలవాటు పడి నగదును విచ్చలవిడిగా ఖర్చుచేశారు. చిట్టీలు కట్టిన వారు, అప్పు ఇచ్చిన వారు అతనిపై ఒత్తిడి తేవడంతో ఈ నెల 6న ఇంటి నుంచి పరారయ్యారు. 
 
దీంతో బాధితులు గిద్దలూరు పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. మాజీ సైనికుడు రమణారెడ్డి రూ.4 కోట్ల మేర వసూళ్లకు పాల్పడి మోసగించినట్టు ప్రాథమికంగా గుర్తించారు. అతని వద్ద ఉన్న విలువైన పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. కృష్ణంశెట్టిపల్లె గ్రామ సమీపంలో రమణారెడ్డి ఉన్నట్టు తెలుసుకుని అరెస్టు చేసినట్టు పోలీసులు వెల్లడించారు.