గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : బుధవారం, 10 జూన్ 2020 (18:52 IST)

కరోనా ముసుగులో పబ్లిక్ ఆస్తుల లూటీ.. వలస కూలీల మరణాలు సర్కారీ హత్యలే: సీపీఐ

కరోనా వైరస్ ని అడ్డంపెట్టుకుని రహస్య అజెండా పబ్లిక్ ఆస్తుల విక్రయానికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ద్వారాలు తెరచిందని, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిందని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె.నారాయణ విమర్శించారు.

కరోనా కష్టకాలంలో వలస కార్మికులను, ప్రజల ఆరోగ్య క్షేమాలు ఆలోచించకుండా పబ్లిక్ ఆస్తుల లూటీకి కేంద్రం పాల్పడటం సిగ్గుమాలిన చర్య అని, అవి మోడీ నియంతృత్వ పాలనకు పరాకాష్ట అని ఆయన మండిపడ్డారు.

విజయవాడ దాసరి భవన్‌లో జరిగిన విలేఖరుల సమావేశంలో నారాయణ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ బాటలోనే ఆంధ్రా తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం నడుస్తూ, ప్రభుత్వ, భూముల విక్రయాలకు దిగడం దుర్మార్గమని, ప్రభుత్వ నిర్ణయాలను ఆయన వ్యతిరేకించారు.

కరోనా వైరస్ వ్యాప్తి నివారణలో భాగంగా దేశ వ్యాప్త ఫిక్కీ (ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ) అనే సంస్థ కార్పొరేట్ దోపిడీకి తెరలేపిందన్నారు.

కరోనా బాధితులకు కార్పొరేట్ ఆస్పత్రుల్లో వైద్య సేవల పేరిట నెలకు దాదాపు లక్ష రూపాయల ప్యాకేజీ ప్రతిపాదనలను ఫిక్కీ ప్రభుత్వాలకు పంపి, బేరసారాలాడుతోందని వాటిని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యతిరేకించాలని డిమాండు చేశారు.

నిజంగా కరోనా బాధిత రోగులపై పెట్టకూడదని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వానికి శ్రద్ధ ఉంటే, ఫిక్కీ తరహా ప్యాకేజీని ప్రభుత్వాస్త్రుల్లో ఎందుకు ఫిక్కీ సూచించిన ప్యాకేజీ ప్రతిపాదన ప్రకారం ప్రతి రోగికి రోజుకు లక్ష చొప్పున, 14 రోజుల పాటు రూ.14 లక్షలు చెల్లించాల్సి ఉంటుందని వివరించారు.

ఒక్కసారి ఎవరైనా ఆస్పత్రిలో అడ్మిట్ అయితే, వారికి విడతల వారీగా వైద్య సేవలందించి, దోపిడీకి పాల్పడే ప్రమాదముందని హెచ్చరించారు.

కరోనా వైరస్ నియంత్రణ కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న లా తోపాటు విభిన్న కార్యక్రమాల్ని, నిబంధనల్ని ఆరోగ్యరీత్యా తాము ఆహ్వానించామని గుర్తుచేశారు. ఇదే సమయంలో ముందస్తుగా ప్రభుత్వాస్పత్రులు బలోపేతం చేయాలని, వలస కార్మికుల సమస్యల్ని పరిష్కరించాలని కమ్యూనిస్టు పార్టీ తరపున ఒత్తిడి తెచ్చామన్నారు.

ఇటీవల కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఐదు రోజులపాటు సీరియల్ గా ప్రవేశపెట్టిన ఆర్థిక ప్యాకేజీలతో వలస కార్మికులు, అసంఘటిత రంగ కార్మికులు, ప్రజలకు ఏ మాత్రం ప్రయోజనకరంగా లేదని వివరించారు.

పారిశ్రామిక వేత్తలకు మేలు చేసేలా ఆమె బడ్జెట్ ఉందన్నారు. వలస కార్మికులకు నెలకు కనీసం రూ.200 వచ్చే పరిస్థితి లేదన్నారు. కరోనా ప్రభావంతో మొదట వలస కార్మికులు, ఆ తర్వాత అసంఘటిత రంగ కార్మికులే తీవ్రంగా నష్టపోయారని చెప్పారు.

ఈ దేశంలో సంపదను సృష్టిస్తున్న వలస కార్మికులకు చెందిన లెక్కలు కేంద్రం దగ్గర లేకపోవడం దురదృష్టకరమని సమాచార హక్కు చట్టం ద్వారా వాటి వివరాల్ని అడిగినా కేంద్ర ప్రభుత్వం దగ్గర లేవని తేటతెల్లమైందన్నారు కేంద్రం దగ్గర అంబానీ విజయ్ మాల్యా వంటి కార్పొరేట్ దిగ్గజాలకు ఎంతెంత ఆస్తులున్నాయనే చిట్టానే ఉందని ఎద్దేవా చేశారు.

45 రోజుల తర్వాత దేశ వ్యాప్తంగా వలస కార్మికులు బజారున పడి రోడ్లపై నడుస్తూ దాదాపు 160 మంది చనిపోయాక.. కేంద్రం మొక్కుబడిగా స్పందించి కేవలం 8 కోట్ల మందే వలస కార్మికులు ఉన్నట్లు చూపించారన్నారు.

కేంద్రం మద్యం విక్రయాలకు అనుమతివ్వడంతోనే రాష్ట్రాల్లో విచ్చలవిడిగా కొనసాగించారని, దీంతో కరోనా వైరస్ మరింత పెరిగిదందని చెప్పారు. జనవరి 19న ప్రపంచ ఆరోగ్య సంస్థ కరోనాతో ప్రమాదముందని హెచ్చరించగా, కేరళ ప్రభుత్వం ముందస్తుగా స్పందించి విదేశాల నుంచి వచ్చే వారిపై నిఘా ఉంచిందన్నారు.

దేశంలో మార్చి 23 వరకూ విదేశీయుల రాకపోకలను కేంద్రం కొనసాగించిందని మధ్యప్రదేశ్ ప్రభుత్వాన్ని కూల్చాకే లాక్ ను ప్రకటించారని విమర్శించారు. 

తొలి లాక్‌డౌన్‌కు రెండు రోజుల ముందు దేశంలోని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కేంద్రం సంప్రదింపులు చేపట్టి, వలస కార్మికులను ఎక్కడి వారిని అక్కడకు తరలిస్తే ఇన్ని మరణాలు సమస్యలు ఉండేవి కావన్నారు.

కేంద్రం తీసుకున్న ఏకపక్ష నిర్ణయాలతో నేడు దేశ వ్యాప్తంగా కోట్లాది మంది వలస కార్మికులు ఆకలి కేకలతో అలమటిస్తున్నారని, అనేక మంది మృత్యువాతకు గురయ్యారని చెప్పారు. ఇవన్నీ కేంద్ర సర్కారు హత్యలుగానే భావిస్తున్నామని పేర్కొన్నారు.

ఇప్పుడు మోడీ, అమిత్ షాలు బీహార్ కు వెళ్లి వలస కార్మికుల పై కపట ప్రేమ నటిస్తున్నారని తూర్పారబట్టారు. వలస కార్మికులు కేరళ ప్రభుత్వం కరోనా బాధితులకు రూ.5వేల చొప్పున ఇచ్చి, అదనంగా నిత్యవసర సరుకులను పంపిణీ చేసిందన్నారు.

పారిశ్రామిక వేత్తలకు పెద్ద ఎత్తున ప్రయోజనాలను కేంద్రం చేకూర్చిందని, లక్షల కోట్లు పన్నుల రాయితీలు ఇచ్చిందని వివరించారు. కార్మికులకు రూ.10వేల చొప్పున ఇస్తే పెద్ద నష్టమేమీ ఉంటుందన్నారు. వలస కార్మికులను ఆదుకునేందుకు గాను ఇంతవరకూ కేంద్రం సమగ్రమైన విధానాన్ని ప్రకటించలేదని విమర్శించారు.

ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వ హక్కుల కోసం ఉద్యమించారని గుర్తుచేశారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల విద్యుత్ సవరణ చట్టం చేసేందుకు నిర్ణయించి, క్రమేపీ రాష్ట్రాల హక్కుల్ని హరించేలా కుటిల ప్రయత్నాలు చేస్తోందన్నారు.

కేంద్రం విధానాలకు వ్యతిరేకంగా ఆంధ్రా, తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం హక్కుల కోసం పోరాడాలని సూచించారు. రాజ్యాంగ హక్కులను హరించేలా బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తోందని, వాటికి వ్యతిరేకంగా తాము ఉద్యమిస్తామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వానికి ప్రతి సందర్భంలోనూ కేసీఆర్, జగన్ మద్దతిస్తున్నారని గుర్తుచేశారు.

అధికార పార్టీల ఆగరాలను ఎదుర్కొనేందుకు ప్రతిపక్షాలన్నీ ఒకే వేదికగా, ఐక్యంగా పోరాడాల్సిన అవసరముందని పిలుపునిచ్చారు. 

నాడు ప్రతిపక్ష నేత చంద్రబాబు రాజకీయ విధానపరమైన నిర్ణయాలు చేపట్టనందునే ఓటమి పాలయ్యారన్నారు. నాడు బీజేపీ జతకట్టిన, ప్రత్యేక హోదాను టీడీపీ ప్రభుత్వం సాధించలేక పోయిందని చెప్పారు.

టీడీపీ వెంటిలేటర్ దశకు వెళ్లిన సమయంలో ఎన్నికల ముందు బీజేపీ పై చంద్రబాబు పోరాడినా, ఎన్ని సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టినా ఫలితం దక్కలేదని గుర్తుచేశారు. సంక్షేమ పథకాల అమలు చేయడం ప్రభుత్వ గొప్పతనమేమీ కాదని, అది ప్రభుత్వ సొత్తేమీ కాదని, ప్రజల సొమ్మేనని నొక్కి చెప్పారు.

ప్రజల చెల్లించిన పన్నుల్లో 75శాతం మిగుల్చుకుని, ఇందులో 25 శాతమే సంక్షేమ పథకాల పేరిట ఆర్భాటంగా ప్రభుత్వాలు ఖర్చు చేస్తున్నాయని విమర్శించారు. సంక్షేమ పథకాలతో ప్రభుత్వాలు ఏర్పడటం సాధ్యమని, రాజకీయ విధానాలతోనే ప్రభుత్వాలు ఏర్పడతాయని ఆయన సూచించారు.

ఎన్నికల ముందు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సైతం తమకు 25 లోక్ సభ సీట్లు ఇస్తే.. కేంద్రంతో పోరాడి, ప్రత్యేక హోదా తెస్తామని చెప్పారన్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మోడీ ని వ్యతిరేకించే సత్తా లేక, కేంద్రంలో బీజేపీ పూర్తి మెజార్టీలో ఉ ఉందంటూ కుంటి సాకులు చెబుతూ, హోదా అంశాన్ని విస్మరిస్తున్నారని ఎద్దేవా చేశారు.

ఎన్నికల మేనిఫెస్టోలో అమరావతి రాజధానిని మారుస్తానని ఎక్కడా జగన్ పేర్కొనలేదని, అధికారంలోకి వచ్చాక రాజధాని మార్చుతూ ప్రకటించడం తగదన్నారు. రాబోయే జనరల్ ఎన్నికల్లో అమరావతి రాజధాని, ప్రత్యేక హోదా అజెండాలతోనే ఎన్నికలు ఉ రాయని ఆయన వెల్లడించారు.

ఏపీ ఎన్నికల కమిషనర్ వ్యవహారంపై మాట్లాడుతూ హైకోర్టు, చట్టాలు అంటే లెక్కలేని తనంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందన్నారు. రాష్ట్రాల్లో గవర్నర్ పదవులు రాజకీయ పునరావాస కేంద్రాలుగా మారాయని విమర్శించారు. పార్లమెంట్లో చర్చించి నిర్ణయిస్తేనే ఎన్నికల కమిషనర్ ను మార్చే అవకాశముంటుందని చెప్పారు.

ఇప్పటికే వైసీపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న నియంతృత్వ పోకడలపై ఇంటిపోరు మొదలైందని, అధికార ఎమ్మెల్యేలు, ఎంపీలు ఒక్కొక్కరుగా వారి అసమ్మతిని వెల్లగక్కుతున్నారని వివరించారు. 

ఏపీలో 2లక్షల టన్నుల ఇసుక మాయమైందనే ప్రచారముందని, ఇంక మాఫియా ఆగడాలు పెట్రేగిపోతున్నా ప్రభుత్వం స్పందించడం లేదన్నారు. కరోనా లాక్‌డౌన్‌లో అధికార పార్టీ నేతలంతా బయట విచ్చలవిడిగా తిరుతుంటే, ప్రతిపక్ష పార్టీల నేతలకు మాత్రం అడుగడుగునా నిబంధనల పేరిట ప్రభుత్వం బుడ్డంకులు సృష్టిస్తున్నాయని చెప్పారు.

లాక్ డౌన్ పేరిట, ఫిజికల్ డిస్టెన్స్ నినాదంతో రాజకీయ స్వేచ్ఛను హరిస్తున్నారని మండిపడ్డారు. ఎక్కడైనా వలస కార్మికులు, అసంఘటిత రంగ కార్మికులు ఇబ్బంది పడినా చూస్తూ ఊరుకోబోమని, వారిని అండగా నిలుస్తామని చెప్పారు.

రాబోయే రోజుల్లో కార్మిక, శ్రామిక వర్గం శ్రేయస్సు కోసం తెగించి పోరాడుతామని ప్రకటించారు. విలేక‌రుల స‌మావేశంలో జెల్లి విల్స‌న్‌, అక్కినేని వనజ పాల్గొన్నారు.