రామతీర్థంలో కోదండ రామాలయం పునర్నిర్మాణం!
రామతీర్థంలో విగ్రహం ధ్వంసమైన ప్రాంతాన్ని పరిశీలించిన అనంతరం.. మంత్రులు వెల్లంపల్లి, బొత్స దేవాదాయశాఖ అధికారులు, అర్చకులతో సమావేశమయ్యారు. ఆగమశాస్త్రం ప్రకారం దేవాలయ పునర్నిర్మాణం చేపట్టాలని వేదపండితులు అన్నారు.
ముందుగా బాల ఆలయాన్ని కట్టాలని తెలిపారు. ధ్వంసమైన విగ్రహాన్ని సముద్రతీరాన నదీసంగమంలో నిమజ్జనం చేయాలని, అనంతరం ఆలయ పునర్నిర్మాణ పనులు చేపట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో దేవాదాయశాఖ కమిషనర్ పి.అర్జునరావు, అదనపు కమిషనర్ కె.రామచంద్రరావు పాల్గొన్నారు.
ఆలయాలపై దాడులు కుట్రపూరితం
హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడులు హేయమైన చర్య అని, ఇందుకు పూర్తి బాధ్యత తెదేపా నేతలే వహించాలంటూ దేవాదాయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు అన్నారు. త్వరలోనే దోషుల్ని పట్టుకుని చట్టానికి అప్పగిస్తామని విలేకర్లతో చెప్పారు. మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి రామతీర్థం వస్తే అడ్డగించడమే కాకుండా వాహనంపై రాళ్ల దాడి చేస్తారా అంటూ ప్రశ్నించారు.
సంయమనం పాటిస్తున్నాం కాబట్టే మీ మాటలు హద్దు దాటుతున్నాయి.. ఇంకా ఎక్కువ మాట్లాడితే సహించబోమని మంత్రి బొత్స పేర్కొన్నారు. అనంతరం ఈవో కార్యాలయంలో మంత్రులు, దేవాదాయ శాఖ కమిషనర్ పి.అర్జునరావు, దేవస్థానం అధికారులతో సమావేశమై సమీక్షించారు. బోడికొండపై ఉన్న కోదండరామాలయం అభివృద్ధి బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుందన్నారు.
త్వరలో విగ్రహ పునఃప్రతిష్ఠాపన
విజయనగరం జిల్లా రామతీర్థం కొండపై కొత్తగా మరో రాముడి విగ్రహం తయారుచేయించి పునః ప్రతిష్ఠాపన చేస్తామని రాష్ట్ర దేవాదాయశాఖ కమిషనర్ అర్జునరావు పేర్కొన్నారు. ఆదివారం ఆయన సింహాచలంలో విలేకర్లతో మాట్లాడారు. మంచి ముహూర్తం చూసి జనవరి చివరి లేదా ఫిబ్రవరి మొదటి వారంలో కొత్త విగ్రహాన్ని తిరిగి ప్రతిష్ఠించాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఇందుకోసం ముగ్గురు పండితులతో కమిటీ వేశామన్నారు. సింహాచలం దేవస్థానం భూములను కబ్జా చేసేవారిపై కఠిన చర్యలు తప్పవన్నారు.
అనుమానితులను విచారిస్తున్నాం: ఎస్పీ
శ్రీరాముడి విగ్రహ ధ్వంసం కేసులో ఇప్పటివరకు 20 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నట్లు విజయనగరం ఎస్పీ బి.రాజకుమారి తెలిపారు. దర్యాప్తు కోసం 5 బృందాలను ఏర్పాటు చేసినా కచ్చితమైన సాక్ష్యాధారాలు లభించలేదన్నారు. వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి కారుపై దాడి ఘటనలో ఆయన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేపట్టామని ఎస్పీ తెలిపారు.