శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 2 జనవరి 2021 (20:28 IST)

చంద్రబాబునాయుడి పర్యటనను అడ్డుకోవడానికే విజయసాయితో రామతీర్థం పర్యటన: వర్ల రామయ్య

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అసమర్థ పాలన సాగిస్తున్నాడని, ఏపీప్రభుత్వం, డీజీపీ సవాంగ్ శాంతిభద్రతల నిర్వహణలో ఘోరంగా విఫలమయ్యారని, టీడీపీ జాతీయప్రధాన కార్యదర్శి, పార్టీ పొలిట్ బ్యూరోసభ్యులు వర్ల రామయ్య ఆగ్రహం వ్యక్తంచేశారు.

శనివారం ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే క్లుప్తంగా మీకోసం...!
 
మాజీముఖ్యమంత్రి, టీడీపీ అధినేత విజయనగరం జిల్లాలోని రామతీర్థం క్షేత్రానికి వెళ్లడానికి ప్రభుత్వ అనుమతి కోరారు. 2వ తేదీన విజయనగరం జిల్లాలోని రామతీర్థం పర్యటనకు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబువస్తున్నట్లు, 1 వతేదీనే, ఆయన వ్యక్తిగత కార్యదర్శి ప్రభుత్వానికి తెలియచేశారు. 

విజయనగరం పర్యటనకు వెళ్లిన చంద్రబాబుని పోలీసులు ఎలా ఆపుతారు? మాజీ ముఖ్యమంత్రి, జడ్ ప్లస్ భద్రతలో, ఎన్ ఎస్ జీ కమాండోల పహారాలోఉన్నవ్యక్తి, వాహనశ్రేణిలో ఒక్కవాహానాన్నే అనుమతిస్తారా? ఏపీ పోలీస్ మాన్యువల్ ప్రకారం, చట్టంప్రకారం పోలీసులు ఎవరిని ఆపాలి? అనుమతులు తీసుకొని, విజయనగరా నికి బయలుదేరిన చంద్రబాబునాయుడినా...లేక  కేతిగాడిలా పదిమందితో వచ్చిన ఎంపీ విజయసాయినా?

విజయనగరం జిల్లాలో మంత్రులు లేరా? రామతీర్థానికి, విజయసాయికి సంబంధ మేంటి? అక్కడున్న మంత్రులు గుర్రుపెట్టి నిద్రపోతున్నారా? ప్రజలు ఎన్నుకున్న ఎమ్మెల్యేలు, ఎంపీలు లేరా? అసలు విజయ సాయికి ఏం సంబంధం? శాంతిభద్రతలకు విఘాతం కలిగించడానికి పదిమందిపోకిరీలతో వెళుతున్న కేతిగాడిని అరెస్ట్ చేయకుండా, చంద్రబాబుని అడ్డుకుంటారా?

రామతీర్థం దేవాలయందగ్గర నేడు జరిగిన చర్యలన్నీ ప్రభుత్వప్రణాళికలో భాగంగా జరిగినవే. పేకాటలో జోకర్ లాంటి విజయసాయిని వదిలేసి, సుదీర్ఘ అను భవం ఉన్న ప్రతిపక్షనేతను అడ్డుకుంటారా? డీజీపీ కావాలనే విజయసాయిని తెరపైకి తెచ్చి, అతని ప్రోగ్రామ్ ని డిజైన్ చేశారు. చంద్రబాబు పర్యటనను అడ్డుకోవడానికే అలా చేశారు.

ఆద్యంతం ఒకరోజంతా కోర్టులో నిలబడినా డీజీపీ మారరా ?  గతంలో విశాఖపట్నం విమానాశ్రయంలో చంద్రబాబుని అడ్డుకు న్నందుకే కదా డీజీపీ కోర్టులో చేతులకట్టుకొని నిలబడింది. ఒక కేతిగాడికోసం మరలా కోర్టుకు వెళ్లడానికి ఆయన సిద్ధమయ్యా రా? డీజీపీ ఒక పోలీస్ అధికారిగా పనిచేస్తున్నారా లేక వైసీపీ కార్యకర్తలా చేస్తున్నారా? 

విజయసాయిని రామతీర్థానికి అనుమతించిన పోలీసు అధికారులపై, డీజీపీ పై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి. డీజీపీ తక్షణమే రాజీనామాచేయాలని అడగాలని ఉంది. కానీ పోలీస్ శాఖపట్ల నాకున్న సానుభూతి కారణంగా అడగలేకపోతున్నాను. 

రామతీర్థంలో ఈరోజు జరిగిన సంఘటనలపై డీజీపీ తనకు తానే  ఆత్మపరిశీలనచేసుకుంటే మంచిది. చంద్రబాబునాయుడు రామతీర్థానికి వస్తుంటే, విజయసాయిరెడ్డిని అనుమతించడం అనేది ఎంతవరకు కరెక్టో డీజీపీ చెప్పాలి. డీజీపీప్రవర్తన అలా ఉంటే, ఆయన కిందపనిచేసే పోలీసులు నిష్పక్షపాతంగా ఎలా పనిచేస్తారు?

చంద్రబాబునాయు  డు తనపర్యటన ముగించుకొని, తిరిగివెళ్లేవరకు విజయసాయి రెడ్డిని ఆపకుండా, ఎలా అనుమతించారు? మరలా మరోసారి కోర్టుకు వెళ్లి, చేతులుకట్టుకొని నిలబడటానికి డీజీపీ సిద్ధమయ్యా రా?  రాష్ట్రంలో ఒకమతంపై ప్రణాళికాబద్ధంగా దాడిజరుగుతుంటే పోలీస్ శాఖ ఎందుకు ఉదాసీనంగా వ్యవహరిస్తోందో డీజీపీ సమాధానం చెప్పాలి. వేరేఅంశాల్లోకి వెళితే డీజీపీ ఏమైపోతాడో కూడా తెలియదు. ఆయన దగ్గర సమాధానాలే లేవు.

రామతీర్థం ఘటనలో ముద్దాయిలు అరెస్ట్ అవుతారని చెప్పడానికి విజయసాయిరెడ్డి ఎవరు?  ఆయనెవరు అసలు ముద్దాయిల గురించి మాట్లాడటానికి? ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాలకు హోం మంత్రి విజయసాయిరెడ్డి అయితే, మిగిలిన పదిజిల్లాలకు సజ్జల రామకృష్ణారెడ్డి. హోంమంత్రిని డమ్మీని చేసి ఆడిస్తున్నారు. 

ప్రజలంతా సవాంగ్ నిర్దేశకత్వంలోనే రాష్ట్రంలోని పోలీసులు పనిచేస్తున్నారని అనుకుంటున్నారు. ఈరోజు జరిగినదానికి డీజీపీ మరలా కోర్టుకెళ్లబోతున్నాడని, ఒక పోలీస్అధికారి పకపకా నవ్వతూ చెబుతున్నాడు. కొద్దిరోజుల్లో పదవీవిరమణ చేయబోతున్న డీజీపీ ఎందుకు ఇటువంటి సంఘటనల్లో పాలుపంచు కుంటున్నాడు? ఒకరాజకీయపార్టీకి వత్తాసు పలకాలని ఎందుకు చూస్తున్నాడు?

విశాఖపట్నంలోని మంత్రి, విజయనగరంలోని మంత్రి ఏంచేస్తున్నారు? ఢిల్లీలో పైరవీలు చేసుకోకుండా విజయ సాయికి ఏం పని అక్కడ?  ఎవరినైనాకలవడానికి వెళ్లేముందు అటెండర్లను డబ్బుతో  మేనేజ్ చేసే విజయసాయి ఒక మేనేజర్ మాత్రమే. అటువంటి వ్యక్తికి రామతీర్థంలో ఏంపని అంటున్నాను. 

మంత్రులంతా పనికిరానివాళ్లని విజయసాయి చెబుతుంటే, వారం తా ఏంచేస్తున్నారు? ఉత్తరాంధ్రలోని నేతలంతా పనికిమాలినవాళ్లని , అక్కడున్న వారిలో విజయసాయిరెడ్డే సమర్థుడని ముఖ్యమంత్రి చెబితే, ఎవరూ పట్టించుకోరు. పోలీస్ శాఖకు తలనొప్పిగామారిన విజయసాయిని అడ్డుకోవాల్సిన అవసరం డీజీపీకి లేదా? 

చంద్రబాబునాయుడు ఎప్పుడు ఎక్కడికి వెళ్లినా, ఆయన పర్యటనను ఎలా చెడగొట్టాలనే బ్లూప్రింట్ ఏమైనా డీజీపీ దగ్గరుం దా? రామతీర్థంలో నేడుజరిగిన సంఘటనలను చూస్తుంటే, అక్కడ శాంతిభద్రతలకు విఘాతం కలిగిందో లేదో డీజీపీచెప్పాలి.  డీజీపీ అసమర్థత వల్లే నేడు అక్కడ పరిస్థితులు అదుపుతప్పాయి.

ఎక్కడైనా సరే పోటీ ఉద్యమాలు, పోటీ పర్యటనలు నిర్వహించడ మేంటి? అలాంటివి ప్రజావ్యతిరేకం, రాజ్యాంగ వ్యతిరేకమని చెప్పాల్సిన బాధ్యత డీజీపీపై లేదా? ముఖ్యమంత్రి ఎలాంటివాడో, ఆయనెలా ముఖ్యమంత్రి అయ్యారో అందరికీ తెలుసు. అటువంటి వ్యక్తికి ఏదితప్పో, ఏది ఒప్పో చెప్పాల్సిన బాధ్యత డీజీపీకి లేదా? 

ముఖ్యమంత్రి ఏదైనా అంటే, ఆయన్ని టైట్ చేసేశక్తి పోలీస్ శాఖకు ఉందంటున్నా. ఆ విషయం తెలిసీకూడా డీజీపీ ఎందుకు మౌనంగా ఉంటున్నారు? అటువంటి వ్యక్తి రాష్ట్ర డీజీపీగా ఉంటే, ప్రజలకు ఏం న్యాయం జరుగుతుంది? హోంమంత్రి పేరుకే హోంమంత్రి, ఆమె ఎవరినీ ఏమీ అడగలేరని నాకు తెలుసు. 

రాష్ట్ల్రంలో దేవాలయాలపై జరుగుతున్న దాడులు ప్రణాళిక బద్ధంగానే జరుగుతున్నాయి. ప్రభుత్వ అసమర్థతను గ్రహించిన వారే, అటువంటి దాడులు చేస్తున్నారు. ప్రభుత్వ, పాలకులు అసమర్థతను సాకుగా చూసుకొనే దేవాలయాలపై  దాడులు జరుగతున్నాయి.

డీజీపీ వెంటనే దాడులను అరికట్టడానికి చర్యలు తీసుకోవాలి. చంద్రబాబునాయుడిని అడ్డుకోవాలని చూడటం ద్వారా డీజీపీ చేయరాని తప్పుచేశారు. తన విధినిర్వహణలో ఆయనెందుకు విఫలమవుతున్నాడని ఆలోచిస్తే, ఎక్కడో ఏదో లింక్ మిస్సవుతున్నట్లు నాకు అనిపిస్తోంది.