బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 2 జనవరి 2021 (19:41 IST)

రామతీర్థం ఘటన వెనక స్వార్థపర శక్తుల ప్రమేయం: మంత్రి బొత్స సత్యనారాయణ

విజయనగరం జిల్లా రామతీర్థం దేవాలయంలో జరిగిన దుర్ఘటనను రాజకీయం చేస్తూ లబ్ధి పొందాలని కొన్ని శక్తులు చూస్తున్నాయని పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఈ ఘటనపై విచారణ జరుగుతోందని, ఒకటి రెండురోజుల్లో వాస్తవాలు వెలుగులోకి వస్తాయని తెలిపారు. శనివారం నాడు విజయవాడలోని తన నివాసంలో, తనను కలిసిన మీడియా ప్రతినిధులతో ఆయన మాట్లాడారు.

ముఖ్యమంత్రి  వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారి ప్రజారంజక పాలనకు వస్తున్న ఆదరణను చూసి ఓర్వేలేక ఆయన పై బురద చల్ల్లేందుకు, ఒక రాజకీయ పార్టీయో, ఒక వర్గమో , ఇతర స్వార్థ పరశక్తులో చేస్తున్న ప్రయత్నాల్లో భాగమే ఇటువంటివి జరుగుతున్నాయన్న అనుమానాన్ని వ్యక్తం చేశారు. రామతీర్థం ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నానని, దీనికి పాల్పడిన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. 

విజయనగరం జిల్లాలో పెద్ద ఎత్తున పట్టాలు పంపిణీ జరుగుతున్న రోజునే , ఈ ఘటన జరగడం అనుమానాలకు తావిచ్చేదిగా ఉందన్నారు. రామతీర్థం దేవాలయమంటే వ్యక్తిగతంగా తమ కుటుంబానికి కూడా ప్రత్యేక భక్తి శ్రద్దలు ఉన్నాయని,  తన భార్య బొత్స ఝూన్సీ లక్షీ ఎంపిగా ఉన్న సమయంలో, ప్రత్యేక చొరవ చూపి నిధులను సమకూర్చి ఈ దేవాలయాన్ని అభివృద్ధి చేశారని మంత్రి వివరించారు.

అంతే కాకుండా అనేక సంవత్సరాలుగా ప్రతి ఏటా శ్రీరామనవమి పండుగ నాడు, తమ కుటుంబమంతా ఇక్కడి పూజా కార్యక్రమాల్లో పాల్గొంటామని గుర్తు చేస్తూ,  అటువంటి ఈ దేవాలయంలో దుర్ఘటన జరిగితే ఎలా ఊరుకుంటామని అన్నారు. ఘటన గురించి తెలిసన వెంటనే పోలీసు అధికారులతో మాట్లాడి, క్లూస్ టీంను, డాగ్ స్క్వాడ్ ను పంపించాలని సూచించానని, అలాగే, స్థానిక ఎంపి, ఎమ్మెల్యేలను కూడా ఘటనా స్థలికి వెళ్లమని చెప్పానన్నారు. 

ఇంతటి దుర్ఘటన జరిగితే, ఈ ప్రాంతమంతా తమదే అని చెప్పుకునే అశోక్ గజపతి రాజుగారు గానీ, చంద్రబాబుగారి పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యేలు, మంత్రులు ఆ రోజు గడప దాటి ఎందుకు బయటకు రాలేదో చెప్పాలన్నారు. ఏదో నామమాత్రంగా కింది స్థాయి నాయకులను పంపించి , ఈరోజు చంద్రబాబు గారు ఆ ప్రాంతానికి వస్తున్నందునే, వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు పోటీగా వస్తున్నారనే ప్రచారం చేయడం అర్ధరహితమన్నారు.

కేవలం రాజకీయ ప్రయోజనాలు తప్పితే వారికి అసలు ప్రజా ప్రయోజనాలు పట్టవని మండిపడ్డారు. అశోక్ గజపతి రాజుగారు తనంతట తానుగా ఈ రామతీర్థం దేవాలయం అభివృద్ధి కోసం ఒక్క పనైనా చేశారా? అని నిలదీశారు. దేవాలయాల ఆస్తులను కొల్లగొట్టడం, గుడులను కూల్చేసిన వంటి ఘటనలకు పాల్పడిన చంద్రబాబు, ఆయన పార్టీ వారికి అసలు దేవాలయాల పరిరక్షణ గురించి మాట్లాడే నైతిక హక్కే లేదన్నారు. పబ్లిసిటీ కోసం చంద్రబాబు నాయుడు చీప్ ట్రిక్స్ ప్లే చేస్తున్నారని మండిపడ్డారు.

టిడిపి వారిపై కేసులు పెడుతున్నారన్న ప్రశ్నకు బదులిస్తూ,  ప్రస్తుతం విచారణ జరుగుతున్నందున, 2,3 రోజులు  సంయమనం పాటిస్తే నిజాలు వెలుగులోకి వస్తాయన్నారు. ఘటన జరిగిన తీరు చూస్తే, మాత్రం టిడిపి కి ప్రయోజనం కల్గించాలన్న కోణంలోనే ఈ దుశ్చర్యకు పాల్పడ్డారన్న అనుమానాలు బలపడుతున్నాయని విశ్లేషించారు.

దేవాలయంలో ఎక్కడా దొంగతనం జరగలేదని, కేవలం విగ్రహాన్ని మాత్రమే ఎత్తుకెళ్లడం , దానిని ధ్వంసం చేయడం  చూస్తే, మతపరంగా ఉద్రిక్తలు తీసుకురావాలనే దుర్భుద్ధి తో పాటు, అదే రోజున విజయనగరం జిల్లాలో ముఖ్యమంత్రి గారి పర్యటన, ఇళ్ల పట్టాల పంపిణీ కి వస్తున్న ఆదరణపై ఓర్వలేని తనం వంటి ఉన్నాయన్న అనుమానం ఉందన్నారు.

ఇటువంటి ఘటనలు ఎక్కడ జరిగినా ప్రభుత్వం ఉపేక్షించదని, కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నదని, ఒకటి రెండు ఘటనలు మినహా మిగిలిన అన్ని ఘటనల్లోనూ నిందితులను  పట్టుకోవడమే ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తున్న దానికి నిదర్శనమన్నారు. 

జనసేన పార్టీ నాయకులు పవన్ కళ్యాణ్ చేస్తున్న ఆరోపణలపై అడిగిన ప్రశ్నలకు స్పందిస్తూ , ఆయన వ్యాఖ్యలు అపరిపక్వతతో ఉన్నాయని, పాకిస్తాన్ తో పోల్చడం అంటేనే ఆయన ఆలోచనా శైలి ఏ విధంగా అర్ధం అవుతోందన్నారు.