నా వెన్నెముక వైఎస్ జగన్.. ఆయనే బెయిలిప్పించారు : బోరుగడ్డ అనిల్
రౌడీ షీటర్ బోరుగడ్డ అనిల్ కుమార్ మరోమారు వార్తల్లోకెక్కారు. తన వెన్నెముక వైకాపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని చెప్పుకొచ్చారు. ఆయనే తనకు బెయిల్ ఇప్పించారన్నారు. ఆయనే లేకపోతే తాను ఇప్పటికీ జైలులో ఉండేవాడినని అన్నారు.
తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, 'నాకు అండగా నిలిచింది జగన్. ఆయన లేకపోతే నేను ఇప్పటికీ జైల్లోనే ఉండేవాడిని. నూటికి నూరుశాతం జగనన్నే నా వెనుక ఉన్నారు. జగన్ జైలులో ఉన్న సమయంలో బెయిల్ ఇప్పించి బయటకు తీసుకొచ్చిన న్యాయవాదుల బృందం నా కోసం పని చేసింది. ఏపీలో ఇద్దరి కోసమే ఆ లాయర్లు పని చేశారు. ఒకరు నేనైతే... రెండో వ్యక్తి రాష్ట్ర నిఘా చీఫ్‌గా పని చేసిన పీఎస్ఆర్ ఆంజనేయులు అని బోరుగడ్డ అనిల్ అన్నారు.
ఇందుకు సంబంధించిన ఓ వీడియో వైరల్ అవుతోంది. వైకాపా హయాంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేశ్‌లను, వారి కుటుంబ సభ్యులను నీచాతినీచమైన పదజాలంతో దూషించి మహిళలని కూడా చూడకుండా ఘోరంగా అవమానించిన రౌడీషీటర్ బోరుగడ్డ అనిల్ కుమార్‌కు వైకాపా అధినేత జగన్ అండగా నిలవడంపై పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల వైకాపా కేంద్ర కార్యాలయంలో కూడా అనిల్ హడావుడి చేశాడు. ఈ వీడియోలు సైతం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి.