ఆదివారం, 10 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 20 సెప్టెంబరు 2024 (12:40 IST)

జగన్‌కు కార్యకర్తలంటే కరివేపాకుతో సమానం : సామినేని ఉదయభాను

samineni udayabhanu
వైకాపా అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఆ పార్టీ మాజీ నేత, మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను ఘాటైన విమర్శలు చేశారు. జగన్‌కు పార్టీ నేతలు, కార్యకర్తలు అంటే కరివేపాకుతో సమానమని, అందుకే వారి పట్ల ఆయన అంత నిర్లక్ష్యంగా నడుచుకుంటారని అన్నారు. కాగా, జక్కంపేటకు చెందిన సామినేని ఉదయభాను గురువారం వైకాపాకు రాజీనామా చేశారు. ఆయన జనసేన పార్టీ అధినేత పవన్‌తో సమావేశమై జనసేన పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు. 
 
ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ, పార్టీ ఓటమి తర్వాత కూడా జగన్ పార్టీ నాయకులు, కార్యకర్తల విషయంలో నిర్లక్ష్యంగానే ఉన్నారు. అందుకే పార్టీ వీడుతున్నా. మొదటి నుంచి నేను కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నా. ఆ తర్వాత వైకాపాలో చేరాను. రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి ఒకే మార్గంలోనే వెళుతున్నా. ఇప్పుడే పార్టీని వీడుతున్నా. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నియోజకవర్గాన్ని, ఇక్కడి సమస్యలను ఆయన పట్టించుకోలేదు. 
 
నియోజకవర్గ అభివృద్ధికి సహకరించమంటే స్పందించలేదు. వైఎస్ రాజశేఖర రెడ్డి వల్లే ఎమ్మెల్యే అయ్యాను. 2011లో జగన్ పార్టీ పెట్టినప్పుడు.. రాజశేఖర రెడ్డి కుమారుడు ఇబ్బందుల్లో ఉన్నారని భావించి ఆయన వెంట నడిచా. మూడుసార్లు ఎమ్మెల్యేగా ఉన్నా. అయినా జగన్ రాజకీయంగా ఎలాంటి అవకాశాలూ ఇవ్వలేదు. పవన్ కల్యాణ్‌ను కలిసి అన్నీ చర్చించాను. 22న జనసేనలో చేరుతున్నాను అని సామినేని ఉదయభాను వెల్లడించారు.