ఆదివారం, 24 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 30 జూన్ 2021 (18:49 IST)

మాతృభాష తప్పనిసరి: సిబిఎస్‌ఇ, ఐసిఎస్‌ఇ, ఐబీల్లో కూడా తెలుగు తప్పనిసరి

తెలుగు మాట్లాడేవారి సంఖ్య తగ్గుతుందని ఐరాస సంస్థ ‘యూనెస్కో’ పేర్కొంది. ఇదే విషయాన్ని అనేక అధ్యయన సంస్థలు కూడా తెలియజేశాయి. ఆంగ్ల మాధ్యమాల మోజులో తెలుగు అభ్యసనం నిర్లక్ష్యానికి గురవుతుంది. 
 
ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు రాష్ట్రంలోని విద్యార్థులందరూ తప్పనిసరిగా తెలుగును ఒక సబ్జెక్టుగా చదవాలని ఆకాంక్షించారు. దీనికి చట్టాన్ని రూపొందిస్తామని 2017 డిసెంబర్‌లో నిర్వహించిన ప్రపంచ తెలుగు మహాసభల ప్రారంభ, ముగింపు సమావేశాల్లో ప్రకటించి తన భాషాభిమానాన్ని చాటారు. 
 
ఇందుకోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఓ కమిటీని కూడా నియమించింది. రాష్ట్రంలోని అన్ని యాజమాన్యాలు, అన్ని మాధ్యమాలకు చెందిన పాఠశాలల్లో తెలుగును తప్పనిసరి బోధనాంశంగా 2018-19 విద్యా సంవత్సరం నుంచి అమలు చేయడానికి నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు అనుగుణంగా 2018 మార్చిలో జరిగిన శాసన సభ, శాసనమండలి సమావేశాల్లో బిల్లును ప్రవేశపెట్టారు. 
 
ఈ క్రమంలోనే రాష్ట్రంలో తెలుగును బోధించడం, నేర్చుకోవడం తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం చట్టం రూపొందించింది. దీన్ని అనుసరించి.. రాష్ట్రంలోని అన్ని యాజమాన్యాలు అన్నిరకాల పాఠశాలల్లో 2018-19 నుంచి తెలుగును తప్పనిసరి బోధనాంశంగా అమలుపరుస్తున్నారు. 
 
సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈ, ఐబీ పాఠశాలలో ప్రాథమిక స్థాయిలో రెండు భాషలనే నేర్చుకుంటారు. దీంట్లో ఆంగ్లం తప్పనిసరి. అయితే ద్వితీయ భాషగా తెలుగు నేర్చుకునే అవకాశం ఉన్నది. కానీ తప్పనిసరి కాదు. కాబట్టి తాజా చట్టం వల్ల తప్పనిసరిగా తెలుగును నేర్చుకోవాల్సి ఉంటుంది. వారి మాతృభాషను తృతీయ భాషగా నేర్చుకోవచ్చు. 
 
తాజాగా సిబిఎస్‌ఇ, ఐసిఎస్‌ఇ మరియు ఐబి మరియు రాష్ట్రంలోని ఇతర మీడియా పాఠశాలలకు అనుబంధంగా ఉన్న పాఠశాలలు ప్రాథమిక స్థాయిలో 4 వ తరగతికి, 2021-22 విద్యా సంవత్సరంలో సెకండరీ స్థాయిలో 9 వ తరగతికి తెలుగును తప్పనిసరిగా ఇవ్వాలని పేర్కొనడం జరిగింది.