శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : బుధవారం, 2 డిశెంబరు 2020 (06:06 IST)

శ్రీ రాఘవేంద్రస్వామికి శేషవస్త్రం

కర్నూలు జిల్లా మంత్రాలయంలోని శ్రీ గురురాఘవేంద్ర స్వామివారి 349వ ఆరాధన మహోత్సవాల సందర్భంగా టిటిడి తరఫున ఛైర్మ‌న్ వై.వి.సుబ్బారెడ్డి దంప‌తులు, అద‌న‌పు ఈవో ఎ.వి.ధ‌ర్మారెడ్డి దంప‌తులు మంగ‌ళ‌వారం సాయంత్రం శేషవస్త్రం సమర్పించారు.
 
ముందుగా మంత్రాలయం ఆల‌యం వ‌ద్ద‌కు చేరుకున్న ఛైర్మ‌న్‌, అద‌న‌పు ఈవో దంప‌తుల‌కు శ్రీ రాఘవేంద్రస్వామి మ‌ఠం అధికారులు, అర్చ‌కులు సాంప్ర‌దాయ‌బ‌ద్ధంగా స్వాగ‌తం ప‌లికారు.

అనంత‌రం శేష వ‌స్త్రా‌న్ని ఊరేగింపుగా తీసుకుని వెళ్ళి ఆల‌యంలో మఠాధిపతి శ్రీ సుబుదేంద్రతీర్థ స్వామివారికి అందించి శ్రీ రాఘ‌వేంద్ర స్వామివారి ద‌ర్శ‌నం చేసుకున్నారు.

అనంత‌రం ఆల‌య అధికారులు వారికి తీర్థ ప్ర‌సాదాలు అందించారు. మఠాధిపతి శ్రీ సుబుదేంద్రతీర్థ స్వామివారు ఛైర్మ‌న్‌, అద‌న‌పు ఈవో దంప‌తుల‌ను ఆశీర్వదించారు. 
 
ఈ సంద‌ర్భంగా ఛైర్మ‌న్ వై.వి.సుబ్బారెడ్డి మాట్లాడుతూ హైందవ సనాతన ధర్మవ్యాప్తికి కృషి చేసిన సద్గురువులు శ్రీ రాఘవేంద్రస్వామివారికి  2006వ సంవత్సరం నుంచి టిటిడి త‌ర‌పున శ్రీవారి శేషవస్త్రాన్ని సమర్పిస్తోంద‌ని చెప్పారు.

శ్రీవేంకటేశ్వరస్వామి వారి కృపతో 1595వ సంవత్సరంలో తమిళనాడులోని కావేరిపట్నంలో తిమ్మన్న భట్ట, గోపికాంబ దంపతులకు శ్రీ రాఘవేంద్రస్వామివారు జన్మించార‌న్నారు.

శ్రీరాఘవేంద్రస్వామి పూర్వాశ్రమ నామధేయం కూడా వెంకన్న భట్ట. ఈయ‌న‌ వెంకటాచార్యగా ప్రశస్తి చెందార‌న్నారు. తిరుమ‌ల ఆల‌య ఓఎస్‌డి పాల శేషాద్రితో పాటు ప‌లువురు అధికారులు ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు. 
 
శ్రీవారి క‌ల్యాణంలో పాల్గొన్న టిటిడి ఛైర్మ‌న్ దంప‌తులు - 
తుంగ‌భ‌ద్ర‌ న‌ది పుష్కరాల సంద‌ర్భంగా మంగ‌ళ‌వారం సాయంత్రం మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి మఠంలోని యోగీంద్ర మండ‌పంలో శ్రీనివాస కళ్యాణం క‌న్నుల పండువుగా నిర్వహించారు. వేద పండితులు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీవారి ఉత్సవర్లను కల్యాణవేదిక వద్దకు తీసుకువ‌చ్చారు.

అర్చకుల వేదమంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాల నడుమ విష్వక్సేనారాధన, పుణ్యహవచనం, కంకణధారణ, అగ్నిప్రతిష్టాపన, యజమాని సంకల్పం, భక్త సంకల్పం, మహాసంకల్పం, మంగళసూత్రధారణ ఘట్టాలతో వేదమంత్రాలు పఠిస్తూ శాస్త్రోక్తంగా స్వామివారి కల్యాణాన్ని నిర్వహించారు. చివరిగా నక్షత్రహారతి, మంగళహారతి కార్యక్రమంతో కల్యాణం ముగిసింది.