1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : సోమవారం, 21 నవంబరు 2022 (16:05 IST)

ప్రేమించి మరో వ్యక్తిని పెళ్లి చేసుకుందనీ... ఆరు ముక్కలుగా నరికేసిన ప్రియుడు

murderer
ఢిల్లీలో శ్రద్ధా వాకర్ హత్య కేసును మరిచిపోకముందే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మరో దారుణ హత్య జరిగింది. తనను ప్రేమించిన ఓ యువతి.. ఆ తర్వాత తనను కాదని మరో వ్యక్తిని పెళ్లి చేసుకోవడాన్ని జీర్ణించుకోలేక పోయాడు. పైగా, పెళ్లి తర్వాత ఆమె తనతో అక్రమ సంబంధం కొనసాగిస్తున్నప్పటికీ అతను తట్టుకోలేకపోయాడు. ఈ క్రమంలో మాట్లాడుకుందామని పిలిచి గొంతు నులిమి హత్య చేశాడు. ఆ తర్వాత తన స్నేహితుడితో కలిసి ఆమె మృతదేహాన్ని ఆరు ముక్కలుగా చేసి వ్యవసాయ బావిలో పడేశాడు. 
 
ఈ దారుణ హత్య కేసు వివరాలను పరిశీలిస్తే, యూపీకి చెందిన ప్రిన్స్ యాదవ్ యువకుడు అదే ప్రాంతానికి చెందిన 20 యేళ్ల యువతిని ప్రేమించాడు. అయితే, ఆ యువతి తన తల్లిదండ్రులు కుదిర్చిన వ్యక్తిని పెళ్ళి చేసుకుంది. అదేసమయంలో ఆ యువతి వివాహమైన తర్వాత కూడా ప్రిన్స్ యాదవ్‌తో వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తుంది. అయినప్పటికీ తనను కాదని మరో వ్యక్తిని పెళ్లి చేసుకోవడం ప్రిన్స్ యాదవ్‌కు ఏమాత్రం ఇష్టం లేదు. ఈ క్రమంలో ఆమెను హత్య చేయాలని ప్లాన్ చేశాడు. 
 
ఈ నెల 9వ తేదీన మాట్లాడుకుందామని ఆ యువతిని తన బైకుపై చెరకు తోటలోకి తీసుకెళ్లి అక్కడ తన స్నేహితుడితో కలిసి హత్య చేశాడు. ఆ తర్వాత మృతదేహాన్ని ఆరు ముక్కలుగా కోసి, ఆ శరీర భాగాలను పాలిథీన్ కవరులో చుట్టి పక్కనే వున్న వ్యవసాయ బావిలో పడేశారు. 
 
అయితే, ఈ నెల 15వ తేదీన వ్యవసాయ బావిలో శరీర భాగాలు తేలుతూ కనిపించడాన్ని స్థానికులు గుర్తించి, పోలీసులకు సమాచారం అందించారు. దీంతో కేసు నమోదు చేసి సంఘటన స్థలానికి వచ్చిన పోలీసులు శరీర భాగాలను స్వాధీనం చేసుకున్నారు. మృతురాలి మొబైల్ ఫోన్ ఆధారంగా నిందితులను గుర్తించి అరెస్టు చేశారు. ఆ తర్వాత నిందితుడు ప్రిన్స్‌ను హత్యా స్ధలానికి తీసుకెళ్లగా అక్కడ నుంచి తప్పించుకుని వెళ్లేందుకు ప్రయత్నించాడు. 
 
పైగా, చెరకు తోటలో దాచివుంచిన పిస్టల్‌తో పోలీసులపై కాల్పులు జరిపేందుకు ప్రయత్నించడంతో పోలీసులు ఎదురు కాల్పులు జరిపారు. ఈ కాల్పులో నిందితుడి కాలికి బుల్లెట్ తగలడంతో కుప్పకూలిపోయాడు. ఈ కేసులో నిందితుడి నుంచి పదునైన ఆయుధం, కంట్రీ మేడ్ ఫిస్టల్, క్యాట్రిడ్జ్‌ను సొంతం చేసుకున్నాడు.