మంగళవారం, 7 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 17 డిశెంబరు 2024 (10:43 IST)

అత్తగారి ఊరిలో 12 ఇళ్లకు కన్నం వేసిన భలే అల్లుడు!!

thieves
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒంగోలు జిల్లా యర్రగొండపాలెంలో ఓ విచిత్ర సంఘటన జరిగింది. అత్తగారి ఇంటికి వెళ్లిన ఓ అల్లుడు గ్రామంలో 12 ఇళ్లకు కన్నం వేశాడు. ఈ అల్లుడు చేసిన నిర్వాకం చూసి గ్రామస్తులంతా ఆశ్చర్యపోయారు. ఈ వరుస చోరీలపై గ్రామస్తులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
గుర్రపుశాల గ్రామంలోని ఓ కుటుంబ అల్లుడు ముండ్ల రామయ్య అత్తగారి ఇంట్లోనే ఉంటున్నాడు. గత నెలలో గ్రామస్తులు పనుల కోసం వలస వెళ్లారు. అయితే ముండ్ల రామయ్య క్రికెట్ బెట్టింగులను ఆడుతూ చెడు వ్యసనాలకు బానిసయ్యాడు. గ్రామస్తులు పనుల కోసం వలస వెళ్లడం గమనించిన ముండ్ల రామయ్య ఆ ఇళ్లల్లో చోరీ చేయాలని ప్లాన్ చేసుకున్నాడు.
 
రోజుకు మూడు ఇళ్లల్లో నాలుగు రోజుల పాటు 12 ఇళ్లల్లో రామయ్య దొంగతనం చేశాడు. ఆ ఇళ్లల్లో సుమారు రూ.6 లక్షల 74 వేలు చోరీ చేశాడు. ఇదేమీ తనకు తెలియదన్నట్లు రామయ్య ఆ డబ్బుతో హైదరాబాద్ వెళ్లి జల్సాలు చేయడం మొదలుపెట్టాడు. గ్రామంలోని కొన్ని ఇళ్లకు తాళాలు పగులగొట్టి ఉండటాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
 
ఈ ఘటనలపై ఎస్.ఐ. చౌడయ్య గుర్రపుశాల గ్రామానికి చేరుకుని దొంగతనాలు జరిగిన ఇళ్లను పరిశీలించారు. ఈ చోరీ కేసులపై పోలీసులు విచారణ జరపగా, గ్రామ అల్లుడే ఈ ఘన కార్యాలు చేశాడని నిర్ధారణకు వచ్చారు. హైదరాబాద్ వెళ్లి జల్సాలు చేస్తుండగా, పోలీసులు మాటు వేసి అతన్ని పట్టుకున్నారు. 
 
ఆ తర్వాత పోలీసులు తమదైనశైలిలో విచారణ చేపట్టగా 12 ఇళ్లల్లో చోరీలు చేసినట్లు రామయ్య అంగీకరించాడు. ఆ క్రమంలో యర్రగొండపాలెం పోలీస్ స్టేషనులో ఆ నిందితుడిని మీడియా ముందు ప్రవేశపెట్టి సీఐ ప్రభాకరరావు వివరాలు వెల్లడించారు. ఊరి అల్లుడి నిర్వాకం బయటపడటంతో అందరూ ఆశ్చర్యపోతూ ముక్కున వేలేసుకున్నాడు.