గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 22 మే 2021 (11:41 IST)

మోహినీ అవతారంలో శ్రీ గోవిందరాజస్వామి

తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి బ్రహ్మోత్సవాల్లో ఐదవ రోజైన శ‌నివారం ఉదయం శ్రీ గోవిందరాజస్వామివారు పల్లకీపై మోహినీ అవతారంలో అభయమిచ్చారు. కోవిడ్ -19 వ్యాప్తి నేప‌థ్యంలో ఆల‌యంలో ఏకాంతంగా వాహ‌న‌సేవ నిర్వ‌హించారు.
 
సురాసురులు అమృతం కోసం క్షీరసాగరాన్ని మథించారు. అందులో విషంతోపాటు  అమృతం, ఎన్నో మేలి వస్తువులు ఉద్భవించాయి.  చివరికి వారు కోరుకున్న అమృతం లభించింది. దానిని పంచుకోవడంలో కలహం తప్పలేదు.

ఆ కలహాన్ని నివారించి  అమృతాన్ని పంచడానికి శ్రీహరి మోహినీ రూపంలో సాక్షాత్కరించారు.  సమ్మోహనమైన ఆమె చూపులకు అసురులు పరవశులైపోయి ఉండగా , దేవతలకు అమృతం అనుగ్రహించ‌డం జరిగింది.
 
అనంతరం ఉదయం 9.30 నుండి 10.30 గంటల వరకు స్వామి, అమ్మవార్లకు స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనం, కొబ్బరినీళ్ల‌తో అభిషేకం చేశారు. కాగా, సాయంత్రం 5.30 నుండి 6 గంటల వరకు గ‌రుడ‌వాహనంపై స్వామివారు దర్శనమిస్తారు.
 
ఈ కార్యక్రమంలో శ్రీ‌శ్రీ‌శ్రీ పెద్ద‌జీయ‌ర్‌స్వామి, శ్రీ‌శ్రీ‌శ్రీ చిన్న‌జీయ‌ర్‌స్వామి, ఆలయ ప్ర‌త్యేక శ్రేణి డెప్యూటీ ఈవో రాజేంద్రుడు, ఏఈవో ర‌వికుమార్‌‌ రెడ్డి, కంక‌ణ బ‌ట్టార్ ఏ.టి. పార్థ‌సార‌ధి దీక్షితులు, సూపరింటెండెంట్‌ వెంక‌టాద్రి, టెంపుల్ ఇన్‌స్పెక్ట‌ర్‌  మునీంద్ర‌బాబు, అర్చకులు, ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.