ఆదివారం, 17 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : సోమవారం, 17 జులై 2023 (09:34 IST)

తొడగొడుతూ... వెకిలి నవ్వులు నవ్వుతూ సీఐ అంజూ యాదవ్ వికటాట్టహాసం

anju yadav
తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి సీఐగా పని చేస్తున్న అంజూ యాదవ్ వరుస వివాదాల్లో చిక్కుకుంటున్నారు. ఆమె దూకుడే ఆమెకు కష్టాలు తెచ్చిపెడుతున్నాయి. పైగా, వంటిపై పోలీస్ యూనిఫాం ఉందన్న అహంకారంతో పాటు అధికార పార్టీ నేతల అండదండలు ఉన్నాయన్న గర్వంతో మరింతగా రెచ్చిపోతున్నారు. ఆమె వ్యవహారశైలికి సంబంధించిన వీడియోలు ఇపుడు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. 
 
ఇటీవల ఓ మహిళను లాక్కెళుతున్న దృశ్యాలతోపాటు టీడీపీ, జనసేన నేతలను చెంపలపై కొడుతున్న ఉదంతాలు బహిర్గతమవ్వగా, తాజాగా మరో వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. గతంలో తనపై కేసు పెట్టిన వారి హోటల్‌ ముందు నిల్చొన్న సీఐ అంజూయాదవ్‌ ఒకవైపు సెల్‌ఫోన్‌తో వీడియో తీస్తూనే గట్టిగా వెకిలి నవ్వులు నవ్వుతూ.. తొడ కొడుతున్న వీడియో చర్చనీయాంశంగా మారింది. సీఐ స్థాయి అధికారిణి బాధితులను బండి కాగితాలు అడుగుతూ బెదిరిస్తుండటంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 
 
అంతేకాకుండా, గత స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏర్పేడు మండలంలో నామినేషన్ల పరిశీలన జరుగుతుండగా అధికారులు వైసీపీ నేతల ఒత్తిడికిలోనై టీడీపీ అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరించారని ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటనపై టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. టీడీపీ ఇంఛార్జి బొజ్జల సుధీర్‌ పార్టీ శ్రేణులతో కలసి జాతీయ రహదారిపై రాస్తారోకో చేపట్టారు. రేణిగుంట నుంచీ బందోబస్తు నిమిత్తమై వచ్చిన అంజూయాదవ్‌ ఆ సందర్భంగా సుధీర్‌ పట్ల దురుసుగా వ్యవహరించారంటూ టీడీపీ శ్రేణులు ఆందోళనకు దిగారు. 
 
శ్రీకాళహస్తిలో విద్యుత్‌ ఛార్జీల పెంపుపై నిరసన ప్రదర్శించేందుకు వెళ్లిన సందర్భంలోనూ, అలాగే అనాసంపల్లిలో కబ్జా అయిన ప్రభుత్వ భూములను పరిశీలించేందుకు వెళ్లిన సందర్భంలోనూ టీడీపీ నాయకులపై ఆమె దురుసుగా వ్యవహరించారన్న ఆరోపణలున్నాయి. 
 
శ్రీకాళహస్తిలో ఎన్టీఆర్‌ విగ్రహం వద్ద సీఎం జగన్‌ దిష్టిబొమ్మ దహనానికి టీడీపీ నేతలు ప్రయత్నించగా టీఎన్‌ఎస్‌ఎఫ్ నాయకుడు కోబాకు లక్ష్మణ్‌పై సీఐ చేయి చేసుకున్నారు. ఆ తర్వాత పట్టణంలో నిరసన తెలిపేందుకు వెళ్లిన తెలుగు మహిళా నాయకురాలు చక్రాల ఉషపై దురుసుతనం ప్రదర్శించారు. తాజాగా జనసేన నాయకుడు కొట్టే సాయిపై బుధవారం బహిరంగంగా చేయి చేసుకున్నారు. దీంతో ఒకపుడు సూపర్ కాప్‌గా పేరు తెచ్చుకున్న అంజూ యాదవ్... ఇపుడు వరుస వివాదాలతో సొంత శాఖ ప్రతిష్ట మసకబారిపోతుంది.