గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By బిబిసి
Last Modified: బుధవారం, 29 మార్చి 2023 (13:37 IST)

టీటీడీకి కేంద్రం రూ.3 కోట్ల జరిమానా ఎందుకు విధించింది? అసలు ఏమిటీ వివాదం?

tirumala
విదేశీ విరాళాల నియంత్రణ చట్టం (ఎఫ్‌సీఆర్‌ఏ) కింద పొందిన లైసెన్సు గడువు ముగిసినా రెన్యువల్‌ చేసుకోకపోవడంతో తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ)కి కేంద్ర ప్రభుత్వం రూ.3 కోట్ల జరిమానా విధించింది. ఈ లైసెన్సు రెన్యువల్‌ చేసుకోకపోవడంతో విదేశీ భక్తులు హుండీలో వేసిన దాదాపు రూ.30 కోట్ల విలువ చేసే విదేశీ కరెన్సీ టీటీడీ ఖాతాలో డిపాజిట్‌ కాకుండా ఎస్‌బీఐ దగ్గరే ఉండిపోయింది. లైసెన్స్‌ రెన్యువల్‌ కాకపోవడంతో భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్‌బీఐ) ఆ నగదును టీటీడీ అకౌంట్‌లోకి బదిలీ చేయడానికి అంగీకరించలేదు. టీటీడీ ఈ అంశంపై వివరణ ఇచ్చినా, టీటీడీ సకాలంలో ఎందుకు రెన్యువల్‌ చేయలేదనే ప్రశ్నలు వెల్లువెత్తాయి.
 
అసలు ఏంటి వివాదం?
తిరుమల శ్రీవారి ఆలయంలో ఉన్న హుండీలో భక్తులు నగదు, ఖరీదైన కానుకలు సమర్పిస్తుంటారు. హుండీలో ఏవి వేసినా భక్తులు ఎవరికీ, ఎలాంటి లెక్కలూ ఇవ్వాల్సిన అవసరం ఉండదు. దీంతో విదేశీ భక్తులు కూడా తిరుమలకు వచ్చినపుడు స్వామి వారి హుండీలో కానుకలు వేస్తుంటారు. వాటిలో చాలా మంది విదేశీ కరెన్సీ కూడా సమర్పిస్తారు. ఈ విదేశీ కరెన్సీని టీటీడీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా భారత కరెన్సీలోకి మార్చుకుంటూ వచ్చేది. కానీ, 2018 తర్వాత నుంచి విదేశీ కరెన్సీని అలా మార్చుకోవడానికి ఆర్‌బీఐ అంగీకరించడం లేదు. అంతేకాదు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆ కరెన్సీని టీటీడీ ఖాతాలో డిపాజిట్ చేయడానికి కూడా ఒప్పుకోలేదు. అలా 2018 నుంచీ ఇప్పటివరకూ ఎస్‌బీఐ వద్ద విదేశీ కరెన్సీ నిల్వలు పేరుకుపోయాయి. వాటి విలువ దాదాపు రూ.30 కోట్లని టీటీడీ చెబుతోంది.
 
ఏమిటీ ఎఫ్‌సీఆర్ఏ?
విదేశీ భక్తులు శ్రీవారి హుండీలో సమర్పించే విరాళాలను పొందడానికి టీటీడీ కేంద్ర హోంశాఖ నుంచి ఎఫ్‌సీఆర్ఏ చట్టం కింద లైసెన్స్ పొందింది. ఎఫ్‌సీఆర్ఏ అంటే ఫారిన్ కాంట్రిబ్యూషన్(రెగ్యులేషన్) యాక్ట్, 2010. ఈ చట్టం కింద విదేశీ కరెన్సీని ఆర్‌బీఐ 2018 వరకూ అనుమతించింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా ఆ కరెన్సీని టీటీడీ ఖాతాలో డిపాజిట్ చేసేది. కానీ 2018లో లైసెన్స్ గడువు ముగిసినా టీటీడీ దానిని రెన్యువల్ చేసుకోకపోవడాన్ని కేంద్ర హోంశాఖ ఎఫ్‌సీఆర్ఏ విభాగం 2019లో గుర్తించింది. లైసెన్స్ రెన్యువల్ చేసుకోకుండా టీటీడీ విదేశీ కరెన్సీ ద్వారా విరాళాలు సేకరించండంపై రూ.1.14 కోట్ల జరిమానా విధించింది.
 
2020లో ఈ చట్టానికి సవరణలు కూడా చేశారు. దీని ప్రకారం విదేశీ విరాళాలపై వచ్చే వడ్డీని ఆయా సంస్థలు ఉపయోగించకూడదు. కానీ టీటీడీ ఆ మొత్తాన్ని వినియోగించడం, ఆదాయ వివరాలను కూడా సరైన ఫార్మాట్‌లో ఇవ్వకపోవడం లాంటి కారణాలు చెబుతూ తాజాగా మరో రూ.3.19 కోట్ల జరిమానా విధించింది. దీంతో ఈ లైసెన్స్ రెన్యువల్ చేసుకోకపోవడం వల్ల టీటీడీపై కేంద్రం విధించిన మొత్తం జరిమానా రూ.4.33 కోట్లకు చేరింది.
 
టీటీడీ ఏం చెబుతోంది?
కేంద్రం విధించిన జరిమానా గురించి టీటీడీ వివరణ ఇచ్చింది. టీటీడీకి ఉన్న ఎఫ్‌సీఆర్ఏ లైసెన్సును నిబంధనలు పాటించడం లేదనే కారణాలతో 2018లో రద్దు చేశారని టీటీడీ బోర్డ్ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. కేంద్ర ఎఫ్‌సీఆర్ఏ విభాగానికి రూ.3 కోట్ల జరిమానా కూడా చెల్లించామని ఆయన చెప్పారు. "ఫారిన్ కరెన్సీ మార్చుకోవడానికి ఆర్బీఐ లైసెన్స్ ఉండేది. దాన్ని 2018లో రద్దు చేశారు. అప్పట్లో సరిగ్గా పత్రాలు సమర్పించలేదని చెప్పారు. మేం విదేశీ కరెన్సీనీ గత ఐదేళ్లుగా తీసుకోవడం లేదు. అయితే భక్తులు హుండీలో విదేశీ కరెన్సీ వేస్తున్నారు. అది దాదాపు రూ.30 కోట్లకు పెరిగింది. ఇది ధార్మిక సంస్థ కాబట్టి సడలింపులు ఇవ్వాలి. అప్పుడు పత్రాల విషయంలో ఏమైందో తెలియదు.. ఇప్పుడు మేం సహకరిస్తాం అని వారికి చెప్పాం. గతంలో చేసిన దానికి జరిమానా కట్టాలి అన్నారు. దీంతో రూ.3 కోట్లు కూడా కట్టాం " అని ఆయన అన్నారు.
 
ఐదేళ్లలో హుండీ ద్వారా దాదాపు రూ.30 కోట్ల విదేశీ కరెన్సీ వచ్చిందని, ఆ నగదు మార్పిడి కోసం ప్రయత్నించినపుడు, ఆ మొత్తం ఎవరిచ్చారు, ఎలా తీసుకున్నారంటూ ఆర్‌బీఐ ప్రశ్నించిందని టీటీడీ తెలిపింది. ఐదేళ్లలో ఎంతో మంది గుర్తుతెలియని భక్తులు హుండీలో ఆ కానుకలు వేయడంతో, ఎవరు ఏవి ఇచ్చారో గుర్తించడం సాధ్యం కాదని టీటీడీ వెల్లడించింది. తాజా పరిణామాల నేపథ్యంలో కేంద్ర హోం శాఖ అధికారులను టీటీడీ సంప్రదించింది. ప్రస్తుతం కేంద్రం విధించిన జరిమానా చెల్లించేశామని, కొన్ని రోజుల్లో సమస్య కొలిక్కి వస్తుందని టీటీడీ అంటోంది.
 
నిపుణులు ఏం చెబుతున్నారు?
ఎఫ్‌సీఆర్ఏ రెన్యువల్ చేసుకోకుండా టీటీడీ విదేశీ విరాళాలు పొందడం చట్టవిరుద్ధమే అవుతుందని నిపుణులు చెబుతున్నారు. ఆ చట్టంలో ప్రతి ఐదేళ్లకూ రెన్యువల్ చేసుకోవాలని, ఆ లోపు ఏవైనా లావాదేవీలు జరిగుంటే ఆ వివరాలన్నీ ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాల్సి ఉంటుందని తిరుపతికి చెందిన చార్టెడ్ అకౌంటెంట్ చైతన్య బీబీసీతో చెప్పారు. “విదేశీ విరాళాలు తీసుకోవాలి అంటే ఎఫ్‌సీఆర్‌ఏ కింద రిజిస్టరై ఉండాలి. దీని బాధ్యతలను కేంద్ర హోం శాఖ చూసుకుంటుంది. దీనికి ఒక ప్రత్యేక పోర్టల్ ఉంది. దానిలోకి వెళ్ళి లాగిన్ కావాలి. భారత్‌కు వచ్చే ప్రతి విరాళం దిల్లీలోని ఒక ఎస్‌బీఐ అకౌంట్‌లో పడాలి. అక్కడ నుంచి మళ్లీ వెనక్కి తెచ్చుకోవాలి. ఆ రిజిస్ట్రేషన్ కూడా ఐదేళ్లు మాత్రమే పనిచేస్తుంది. ఆ తర్వాత అది రెన్యువల్ చేసుకునే సమయంలో ప్రతిసారీ గత ఐదేళ్లలో ఏయే విరాళాలు వచ్చాయి, ఎలా ఫైల్ చేశారు అన్నీ అప్లోడ్ చేయాలి” ఆయన అన్నారు.
 
రిజిస్ట్రేషన్ రెన్యువల్ చేసుకోకుండా విరాళాలు తీసుకుంటే, కచ్చితంగా జరిమానా విధించడం చట్టంలోనే ఉందని చైతన్య తెలిపారు. “సంవత్సరానికి దాదాపు రూ.1000 కోట్ల టర్నోవర్ ఉన్న టీటీడీ 2012 నుంచీ దీనికి మళ్లీ దరఖాస్తు చేయలేదు. ఒకసారి రిజిస్ట్రేషన్ కాలం చెల్లితే, ఎలాంటి విరాళాలు తీసుకున్నా అది చట్ట విరుద్ధమే అవుతుంది” అని ఆయన వ్యాఖ్యానించారు. టీటీడీకి అనుబంధంగా ఉన్న అన్ని సంస్థలు ఈ లైసెన్స్ రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుందని చైతన్య చెప్పారు.
 
లైసెన్స్ రెన్యువల్ చేసిన కేంద్రం
టీటీడీ విజ్ఞప్తి మేరకు ఎఫ్‌సీఆర్‌ఏ లైసెన్సును కేంద్ర ప్రభుత్వం పునరుద్ధరిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. గతంలో పొందిన లైసెన్స్ గడువు 2018 లోనే ముగిసింది. రూ.3 కోట్ల జరిమానాను చెల్లించిన తర్వాత, టీటీడీ విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకున్న కేంద్రం లైసెన్స్‌ను ఐదేళ్ల గడువుతో రెన్యువల్ చేసింది. 2020 జనవరి నుంచి 2025 జనవరి వరకు దీనికి కాల పరిమితిని విధించింది. విదేశీ కరెన్సీని స్వీకరించిన విధానం, ఆ సొమ్మును ఎలా ఖర్చు పెడుతున్నారనే వివరాలను తమకు తెలియజేయాలని నిబంధనలు పెట్టింది. లైసెన్సు రెన్యువల్‌తో ఎస్‌బీఐ వద్ద ఉన్న రూ.30 కోట్ల విదేశీ సొమ్ము టీటీడీ ఖాతాలో డిపాజిట్ అవుతుంది.