గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 2 జనవరి 2021 (20:24 IST)

ఏపీలో డ్రై రన్ ప్రక్రియ విజ‌య‌వంతం: రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ కమిషనర్

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో రాష్ట్ర వ్యాప్తంగా శనివారం నిర్వహించిన కోవిడ్-19 వ్యాక్సిన్ డ్రై రన్ ప్రక్రియ విజ‌య‌వంత‌మైంద‌ని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ కమిషనర్ కాటంనేని భాస్కర్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఏపీలోని 13 జిల్లాల్లో శనివారం డ్రై రన్ నిర్వహించామన్నారు.13 జిల్లాలు, 39 కేంద్రాల్లో ఈ ప్రక్రియ జరిగిందని చెప్పారు.

ఒక్కో కేంద్రంలో 25 మంది చొప్పున హెల్త్ కేర్ వర్కర్లకు డమ్మీ వ్యాక్సినేషన్ వేసినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మొత్తం 975 మంది పేర్లను నమోదు చేసుకున్నారన్నారు. వీరిలో 954 మందికి వ్యాక్సినేషన్ నిర్వహించగా, 21 మందికి వివిధ సమస్యల కారణంగా వ్యాక్సినేషన్ చేయలేదని పేర్కొన్నారు.

మొత్తం 39 కేంద్రాలలో వాక్సిన్ వినియోగానంతర ప్రభావానికి సంబంధించి 32 మైనర్,  26 మేజర్ సమస్యలు తలెత్తాయని చెప్పుకొచ్చారు. వీటిని వైద్య నిపుణులు పరిష్కరించి కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేశారని కాటంనేని భాస్కర్ స్పష్టం చేశారు.