1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : మంగళవారం, 29 డిశెంబరు 2020 (19:40 IST)

యుకే స్ట్రెయిన్ ఏపిలో విస్తరించినట్లు దాఖలాల్లేవు: ఏపీ వైద్య ఆరోగ్య శాఖ

యుకే స్ట్రెయిన్  ఏపిలో విస్తరించినట్లు ఎటువంటి దాఖలాల్లేవని ఏపీ వైద్య ఆరోగ్య  శాఖ కమీషనర్ కాటంనేని భాస్కర్ నేడొక ప్రకటన లో వెల్లడించారు. రాజమండ్రికి చెందిన మహిళకు మాత్రమే యుకే స్ట్రెయిన్ వచ్చిందని స్పష్టం చేశారు.
 
ఆమెతో సన్నహితంగా ఉన్న కుమారుడికి కూడా నెగటివ్ వచ్చిందని వివరించారు. ఆవిడ నుంచి మరెవరికీ సోకలేదనే విషయాన్ని గ్రహించాలన్నారు. 
 
ఆమెతో కాంటాక్ట్ అయిన ఒకే ఒక వ్యక్తికి కూడా నెగటివ్ వచ్చిందన్నారు. పరిస్థితిని నిరంతరమూ పర్యవేక్షిస్తున్నామనీ, ఆందోళన చెందాల్సిన అవసరంలేదనీ , ఆపోహల్ని నమ్మొద్దనీ విజ్ఞప్తి చేశారు. 

యుకే నుంచి  రాష్ట్రానికి వచ్చిన 1423 మందిలో 1406 మందిని ట్రేస్ చేశామనీ , 17 మంది ట్రేస్ కాలేదనీ వివరించారు. 1406 మందికి ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేయగా వీరిలో 12 మందికి పాజిటివ్ వచ్చిందన్నారు.

అలాగే ఈ 1406 మందికి ప్రైమరీ కాంటాక్ట్ అయిన 6364  మందికి పరీక్ష చెయ్యగా 12 మందికి పాజిటివ్ వచ్చిందన్నారు.  
 
యుకే నుంచి వచ్చిన వారిలో 12 మంది పాజిటివ్ కేసులు , వారి కాంటాక్ట్ కు చెందిన 12 పాజిటివ్ కేసుల(మొత్తం 24 పాజిటివ్ కేసులు) శాంపిళ్లను సిసిఎంబికి పంపించగా రాజమండ్రికి చెందిన మహిళకు మాత్రమే యుకె స్ట్రెయిన్ వచ్చిందని సిసిఎంబి నిర్ధారించిందని , మిగతా 23 మందికి సంబంధించిన రిపోర్టులు సిసిఎంబి నుంచి ఇంకా రావాల్సి ఉందని కాటంనేని భాస్కర్ వివరించారు.