బుధవారం, 27 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , శుక్రవారం, 12 నవంబరు 2021 (14:21 IST)

కాకినాడ ఐడియల్ కళాశాల ప్రైవేటీకరణ నిలపాలని విద్యార్థుల‌ ఆందోళన

కాకినాడలోని ప్రముఖ ఐడియల్ విద్యా సంస్థల ప్రైవేటీకరణ జరిగిపోయిందని, ఈ విద్యా సంస్థలను   ప్రభుత్వం భాద్యత తీసుకుని నడపాలనీ, ఎయిడ్  కొనసాగించాలని డిమాండ్ చేస్తూ పలువురు విద్యార్థులు శుక్రవారం ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. 
 
 
ఈ సందర్భంగా కాకినాడ కలెక్టరేట్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తమ సమస్యలు చెప్పుకునేందుకు పలువురు విద్యార్థులు కలెక్టరేట్ వద్దకు చేరుకుని ధర్నా చేపట్టారు. నేరుగా కలెక్టర్ ని కలిసి వినతిపత్రం అందజేసేందుకు ప్రయత్నించారు. ఈ సందర్భంగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఒక సందర్భంలో మెయిన్ గేటు తోసుకుని విద్యార్థులు వెలుపలికి వెళ్లేందుకు ప్రయత్నం చేశారు. 

 
బారికేడ్లను తోసే సందర్భంలో కొంత సేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వారిని నిలువరించే ప్రయత్నంలో ఒకరిద్దరు విద్యార్థులకు లాఠీ దెబ్బలు కూడా తగిలాయి. తమ న్యాయమైన డిమాండ్ల కోసం ఆందోళన చేపట్టిన క్రమంలో దివ్య తనుజ అనే ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్ధినికి చేయికి దెబ్బ తగిలింది. డీఎస్పీ భీమారావు, డీఆర్ఓ సత్తిబాబులు వచ్చి విద్యార్థులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. 
 

ఐడియల్ విద్యా సంస్థలను ప్రైవేటీకరణ ఆపే వరకు తమ ఆందోళనలు నిలుపుదల చేసేది లేదని, యాజమాన్యాన్ని పిలిపించి చర్చలు జరిపి సానుకూలమైన నిర్ణయం తీసుకోవాలని విద్యార్థులంతా పెద్ద ఎత్తున నినాదాలు చేసారు. సిఆర్పిఎఫ్ బలగాలు కొంతమంది అక్కడకు వచ్చి విద్యార్థులను కొంతమేర తోసుకుంటూ వెళ్ళిపోయారు. దీంతో మరోసారి ఉద్రిక్తత నెలకొంది. డీఎస్పీ భీమారావు చాలా సేపటి వరకూ విద్యార్థులతో చర్చలు జరిపారు.ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు యం.సూరిబాబు టి.రాజాలు ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థుల సమస్యలను పరిష్కరించే దిశగా పోలీసులు అధికారులు ఆలోచించకపోవడం శోచనీయమన్నారు.
 

శాంతియుతంగా ఆందోళన చేస్తున్న క్రమంలో తమపై లాఠీఛార్జి చేసే ప్రయత్నం చేయడం హేయమైన చర్య అన్నారు. జిల్లా కలెక్టర్ వచ్చి తన సమస్య పరిష్కారానికి చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఐడియల్ కళాశాలను ప్రైవేటుపరం చేస్తే భారీ స్థాయిలో విద్యార్థులపై ఫీజుల భారం పడే అవకాశం ఉన్నందున ప్రైవేటీకరణ నిలుపుదల చేయాలని డిమాండ్ చేశారు. మూడు గంటలపాటు కలెక్టరేట్ వద్ద విద్యార్థులు హోరున వర్షంలో సైతం ఆందోళన నిర్వహించారు. సుమారు రెండు వందల మంది విద్యార్థులు ఈ ఆందోళనలో పాల్గొన్నారు.