గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: శుక్రవారం, 12 నవంబరు 2021 (13:33 IST)

రీజనల్‌ కంటెంట్‌లో ప్రవేశించిన డైస్‌ మీడియా తెలుగులో మొదటి సిరీస్ విడుదల

హైదరాబాద్: పాకెట్‌ ఏసెస్‌కు చెందిన ప్రీమియం స్టోరీ టెల్లింగ్‌ ఛానెల్‌ డైస్‌ మీడియా, పండుగ సంబరాలను కాస్త ముందే తీసుకువస్తూ  ప్రాంతీయ కంటెంట్‌ విభాగంలో ప్రవేశిస్తున్నట్లు వెల్లడించింది. దీనిలో భాగంగా తమ మొట్టమొదటి తెలుగు సిరీస్‌ ‘అల్లుడుగారు’ను విడుదల చేసింది. ఈ నూతన సిరీస్‌ డైస్‌ మీడియా గతంలో రూపొందించగా అపూర్వ విజయం సాధించిన ఫ్యామిలీ డ్రామా, ‘వాట్‌ ద ఫోక్స్‌ !’కు రీమేక్‌. అల్లుడుగారు సీజన్‌ 1ను తెలుగు ఓటీటీ  ఆహా లో 29 అక్టోబర్‌ 2021 నుంచి ప్రసారం చేస్తున్నారు.
 
‘అల్లుడుగారు’ ఫ్యామిలీ డ్రామా పూర్తి వినోదాత్మకంగా ఉంటుంది. కొత్తల్లుడు అజయ్‌ (అభిజీత్‌ పూండ్ల) తప్పనిసరి పరిస్ధితులలో అతి జాగ్రత్తపరులైన అత్తమామల దగ్గర సంప్రదాయాలకు అమిత విలువనిచ్చే ఇంటిలో కొన్ని వారాల పాటు ఉండాల్సి వస్తుంది. అత్తమామలను ఆకట్టుకోవడానికి అతను చేసే ప్రయత్నాలు హాస్యోక్తంగా ఉండటం మాత్రమే కాదు అతని పరిస్థితికి జాలిపడేలాగానూ చేస్తాయి.

 
తొలుత కష్టాలనెదుర్కొన్నప్పటికీ, తరువాత ఆ కుటుంబంలో కలిసిపోవడానికి అతను చేసే ప్రయత్నాలు నిస్సందేహంగా ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటాయి. ఈ సిరీస్‌లో అభిజీత్‌ పూండ్ల, నటుడు, దర్శకుడు కాశీ విశ్వనాథ్‌ మరియు సుప్రసిద్ధ తెలుగు నటి ధన్య బాలకృష్ణ నటించగా, జయంత్‌ గాలి దర్శకత్వం చేశారు. గతంలో ఈయన ‘లవ్‌ లైఫ్‌ పకోడి’ చిత్రానికి దర్శకత్వం వహించారు. ప్రాంతీయ డిజిటల్‌ కంపెనీ తమడ మీడియా ఈ సిరీస్‌ సహ నిర్మాణ బాధ్యతలను తీసుకుంది. సుప్రసిద్ధ క్రియేటర్స్‌ చాయ్‌ బిస్కెట్‌ ఈ షోకు రచనా సహకారం అందించింది.
 
పాకెట్‌ ఏసెస్‌ కో-ఫౌండర్‌, సీఈవో అదితి శ్రీవాస్తవ మాట్లాడుతూ, ‘‘రీజనల్‌ కంటెంట్‌ విభాగంలో ప్రవేశిస్తుండటం పట్ల సంతోషంగా ఉన్నాము. మా ప్రాంతీయ కంటెంట్‌ కార్యకలాపాలు ఆరంభించేందుకు తెలుగు చక్కటి మాధ్యమంగా భావించాం. ఇక్కడ కంటెంట్‌, ప్రతిభ పరంగా ఖచ్చితమైన అంతరం మాకు కనిపించింది. అత్యంత విజయవంతమైన టైటిల్స్‌లో ఒకదానిని ప్రాంతీయంగా ప్రతిభావంతులతో పునర్నిర్మించడం మా ఐపీ విలువ విస్తరణను ప్రతిబింబిస్తుంది. త్వరలో డైస్‌ మీడియా నుంచి మరిన్ని తెలుగు, తమిళ షోలను మీరు చూడనున్నారు’’అని అన్నారు.
 
పాకెట్‌ ఏసెస్‌ వద్ద  షో రన్నర్‌ సర్జితా జైన్‌ మాట్లాడుతూ, ‘‘వాట్‌ ద ఫోల్క్స్‌! ఎక్కువ మంది అభిమానించిన సిరీస్‌లలో ఒకటి. దీనిని తెలుగు ప్రేక్షకుల కోసం పునర్నిర్మించడం ఆనందంగా ఉంది. తమడ మీడియా, చాయ్‌ బిస్కెట్‌లు ఈ షోకు ప్రాంతీయ ఫ్లేవర్‌ తీసుకువచ్చారు. కాశీ, సుధ గార్లతో పాటుగా ప్రతిభావంతులైన ధన్య, అభిజీత్‌లు ఈ షోను ఆకట్టుకునేలా నిలిపారు’’ అని అన్నారు. ఐదు భాగాలు కలిగిన ఈ సిరీస్‌ను ఆహా ప్లాట్‌ఫామ్‌పై  29 అక్టోబర్‌ 2021 నుంచి ప్రతి వారం ఓ భాగం విడుదల చేయనున్నారు.