గురువారం, 19 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 12 నవంబరు 2021 (13:37 IST)

న్యూజిలాండ్‌తో తొలి టెస్ట్ మ్యాచ్ : రోహిత్ శర్మ దూరం

పర్యాటక న్యూజిలాండ్ జట్టుతో భారత జట్టు క్రికెట్ సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్‌‌లో భాగంగా ట్వంటీ20 మ్యాచ్‌ల కోసం భారత కెప్టెన్‌గా రోహిత్ శర్మ పేరును ఎంపిక చేశారు. అలాగే, టెస్టు సిరీస్​లో తొలి మ్యాచ్​కు విరాట్ కోహ్లీ దూరం కానున్నాడు. ఈ నేపథ్యంలో అజింక్యా రెహానే కెప్టెన్​‌గా వ్యవహరించనున్నట్టు సమాచారం. 
 
ఈ నెల 17న కివీస్‌తో సొంతగడ్డపై మూడు మ్యాచ్‌ల టీ20, రెండు టెస్టుల సిరీస్‌ ఆరంభం కానుంది. టీ20 ప్రపంచకప్‌ తర్వాత పొట్టి ఫార్మాట్లో కెప్టెన్సీ నుంచి తప్పుకున్న కోహ్లీ స్థానంలో రోహిత్‌‌కు ఆ పగ్గాలు అందించారు. అయితే, వ్యక్తిగత కారణాలు, పనిభారం కారణంగా కోహ్లీ సహా కొంతమంది కీలక ఆటగాళ్లు ఈ టీ20ల నుంచి విశ్రాంతి తీసుకున్నారు. 
 
ఇక వన్డే, టెస్టుల్లో టీమ్‌ఇండియా కెప్టెన్‌గా కొనసాగే కోహ్లీ.. కివీస్‌తో ఈ నెల 25న కాన్పూర్‌లో ఆరంభమయ్యే తొలి టెస్టుకూ దూరం కానున్నాడు. ఈ నేపథ్యంలో ఆ టెస్టులో జట్టును కొత్తగా టీ20 సారథిగా ఎంపికైన రోహిత్‌ నడిపిస్తాడా? లేదా టెస్టుల్లో వైస్‌ కెప్టెన్‌గా ఉన్న రహానె సారథిగా వ్యవహరిస్తాడా? అనే సందేహాలు రేకెత్తాయి. 
 
ఈ పరిస్థితుల్లో బ్యాట్‌తో ఫామ్‌లో లేని రహానే కంటే కూడా రోహిత్‌‌కే ఆ బాధ్యతలు అప్పగించే సూచనలు కనిపించాయి. కానీ కివీస్‌తో టెస్టు సిరీస్‌‌కు రోహిత్‌ దూరం కానున్నట్లు తాజా సమాచారం. దీంతో రహానేనే తొలి టెస్టులో కెప్టెన్‌గా ఉంటాడు. ముంబైలో జరిగే రెండో టెస్టుకు తిరిగి జట్టులోకి రానున్న కోహ్లీనే సారథిగా వ్యవహరిస్తాడు.