శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 3 నవంబరు 2021 (13:30 IST)

ట్వంటీ20 ప్రపంచ కప్ : నేడు ఆప్ఘన్‌తో భారత్ పోరు

ఐసీసీ ట్వంటీ 20 ప్రపంచకప్‌ 2021 టోర్నీలోభాగంగా, బుధవారం ఆప్ఘనిస్థాన్‌తో భారత్ తలపడనుంది. ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్‌లలో చిత్తుగా ఓడిన భారత్.. కనీసం ఈ మ్యాచ్‌లోనైనా గెలుపొందాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు. 
 
అయితే, ఆప్ఘన్‌తో పోరు అంటే ఆషామాషీ వ్యవహారం కాదనేది ఆ జట్టు ప్రదర్శనను చూస్తే అర్థమైపోతుంది. ఆప్ఘన్ స్పిన్‌ త్రయంతో జాగ్రత్తగా ఉండాలని మాజీలు కోహ్లీ సేనను హెచ్చరిస్తున్నారు. అలానే ఓపెనర్లు హజ్రతుల్లా జజాయ్‌, షాహజాద్‌ కూడా ప్రమాదకరమేనని పేర్కొన్నారు. 
 
ఇప్పటికే ఆప్ఘన్ జట్టు ఆడిన మూడు మ్యాచుల్లో రెండు విజయాలు, ఒక ఓటమితో (4 పాయింట్లు) పట్టికలో రెండో స్థానంలో ఉంది. స్కాట్లాండ్‌, నమీబియాపై భారీ విజయాలను నమోదు చేయగా.. పాకిస్థాన్‌ను కూడా ఓడించేంత పని చేసింది. నబీ, రషీద్‌ ఖాన్‌, ముజీబ్‌ స్పిన్‌ను ఎదుర్కొని పరుగులు రాబడితే సగం విజయం సాధించినట్లే.
 
ఈ క్రమంలో కోహ్లీ సేన కూడా ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగాలని క్రికెట్ దిగ్గజం, మాజీ క్రికెటర్ సునీల్‌ గావస్కర్ సూచించాడు. ఆప్ఘన్‌ మ్యాచ్‌లో సీనియర్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ను బరిలోకి దించాలని కోరాడు. అశ్విన్‌ ప్రపంచశ్రేణి బౌలర్‌ అని, అందుకే అఫ్గాన్‌తో మ్యాచ్‌లోనైనా తుది జట్టులోకి తీసుకోవాలని స్పష్టం చేశాడు. 
 
హార్దిక్‌ పాండ్య రెండు ఓవర్లు వేసినా.. బుమ్రా, శార్దూల్‌/షమీ పేస్‌ బౌలింగ్‌ సరిపోతుందని తెలిపాడు. గత రెండు మ్యాచుల్లో స్పిన్నర్లు వరుణ్‌ చక్రవర్తి, రవీంద్ర జడేజాతో బౌలింగ్‌ చేయించినా.. వీరిద్దరూ పెద్దగా ప్రభావం చూపలేదు. మిస్టరీ స్పిన్నర్‌గా పేరొందిన వరుణ్‌ చక్రవర్తి ఆకట్టుకోలేకపోయాడు. 
 
ఇద్దరు స్పిన్నర్లతో బరిలోకి దిగితే మాత్రం వరుణ్ చక్రవర్తి స్థానంలో అశ్విన్‌ను తీసుకోవాలని గావస్కర్‌ సూచించాడు. ఇద్దరు పేసర్లు, ముగ్గురు స్పిన్నర్ల బౌలింగ్‌ దాడితో దిగితేనే ఉత్తమ ఫలితాలను సాధించే అవకాశం ఉందని అభిప్రాయపడ్డాడు. అశ్విన్‌, జడేజా, వరుణ్‌ చక్రవర్తి/రాహుల్‌ చాహర్‌ను ఎంచుకోవచ్చని పేర్కొన్నాడు. సమష్టిగా రాణిస్తోన్న అఫ్గాన్‌ జట్టు ఎంతో ప్రమాదకరంగా ఉందని, తక్కువ అంచనా వేసి ఆడితే మాత్రం పరాభవం తప్పదని హెచ్చరించాడు.
 
భారత జట్టు (అంచనా)
రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్, హార్దిక్ పాండ్యా, రివీంద్ర జడేజా, ఆర్.అశ్విన్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా.