ఆ కామాంధుడిని పదవి నుంచి తొలగించాలి.. ప్రజా సంఘాల డిమాండ్
ఓ మహిళా ఉద్యోగినితో ఎస్వీబీసీ ఛైర్మన్ పృథిరాజ్ అసభ్యకర సంభాషణ సాగించాడు. ఇది తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర ప్రకంపనలు రేపుతోంది. సాక్షాత్ కలియుగదైవం శ్రీ వెంకటేశ్వర స్వామికి చెందిన ఎస్వీబీసీ ఛానెల్‌కు ఛైర్మన్‌గా ఉన్న పృథ్వీ అసభ్యకరంగా ఓ మహిళతో సంభాషణలు సాగించడం ఇపుడు సర్వత్రా విమర్శలకు దారితీస్తోంది. దీనిపై అనేక ప్రజా సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
ఇదే అంశంపై ఈ ప్రజా సంఘాల ప్రతినిధులు ఆదివారం తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ, 'తక్షణం పృథ్వీని ఆ పదవి నుంచి తొలగించాలి. ఇంకెంతమందిని వేధిస్తున్నాడు.. సినిమా పరిశ్రమలో తప్పులు చేయడం వేరు. ఆధ్యాత్మిక సంస్థలో ఇటువంటి పనులు చేయడం తప్పు. ఆయనపై జగన్ చర్యలు తీసుకోవాలి' అంటూ డిమాండ్ చేస్తున్నారు.
అంతేకాకుండా, తితిదేలో సేవల కోసం ఎవరిని పడితే వారిని పెద్ద పెద్ద హోదాల్లో నియమించడం సరికాదని వారు హితవు పలుకుతున్నారు. పద్మావతి గెస్ట్‌హౌస్‌లో కూర్చొని ఆయన మద్యం తాగుతుంటాడని కూడా మాకు ఫిర్యాదులు వచ్చాయి. కఠిన చర్యలు తీసుకోవాలి. కొందరి వద్ద ఆయన డబ్బులు కూడా వసూలు చేశాడు. అలాంటి వ్యక్తిని ఎస్వీబీసీ ఛైర్మన్‌గా కొనసాగిస్తే ఆ సంస్థకే అప్రతిష్ట' అని ప్రజా సంఘాల నేతలు అభిప్రాయపడుతున్నారు.