శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 25 ఫిబ్రవరి 2021 (14:47 IST)

కుమార్తెను ప్రభుత్వ స్కూల్‌లో చేర్చిన తహసీల్దార్ మురళీ కృష్ణ

ప్రభుత్వంలో పైస్థాయి ఉద్యోగులే కాదు.. కిందిస్థాయిలో పనిచేసేవారు కూడా తమ పిల్లల్ని ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల్లో చదివిస్తుంటారు. కానీ ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణాజిల్లా విస్సన్నపేట తహసీల్దార్ మురళీ కృష్ణ తన కుమార్తెను ప్రభుత్వ స్కూల్లో చేర్పించారు. విస్సన్నపేటలోని ఎంపీయూపీ స్కూల్‌కు స్వయంగా ఆయనే తన కుమార్తె సంజనను తీసుకొచ్చి అడ్మిషన్ తీసుకున్నారు. 
 
గత ఏడాది సంజనను ఓ కార్పొరేట్ ఒకటో తరగతి చదివించిన తహసీల్దార్ మురళీకృష్ణ రెండోతరగతికి వచ్చేసరికి ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి అందరికీ ఆదర్శంగా నిలిచారు. గతంలో కూడా పలువురు ఉన్నతాధికారులు తమ పిల్లల్ని సర్కారీ బడుల్లో చేర్పించి అందరికీ ఆదర్శంగా నిలిచారు. 
 
విజయనగరం జిల్లా పార్వతీపురం ఐటీడీఏ పీవోగా పనిచేస్తున్న ఆర్.కూర్మనాథ్ గత ఏడాది నవంబర్లో తన కుమారుడ్ని ప్రభుత్వ స్కూల్లో చేర్పించారు. పార్వతీపురం పట్టణంలోని కేపీఎస్ స్కూల్లో 10వ తరగతి చదువుతున్న తన కుమారుడ్ని చేర్పించారు. 
 
మరోవైపు నెల్లూరు జిల్లా జాయింట్ కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి కూడా ఇదే తరహా నిర్ణయంతో అందరికీ ఆదర్శంగా నిలిచారు ప్రైవేట్ స్కూళ్లకు పోటీ ఇవ్వాలంటే.. అధికారుల పిల్లలు ప్రభుత్వ బడుల్లో చదవాలన్న ఆకాంక్షలను నిజం చేశారు. తనే చొరవ చూపి.. తన ఇద్దరు పిల్లలను గత ఏడాది డిసెంబర్లో ప్రభుత్వ బడిలో చేర్పించారు. కుమార్తె ఎన్‌.
 
అలెక్స్ శృతిని పొదలకూరు రోడ్డులోని దర్గామిట్ట జెడ్పీ ఉన్నత పాఠశాలలో, కుమారుడు ఎన్‌.క్రిష్ ధరణ్‌రెడ్డిని వేదాయపాళెం స్పిన్నింగ్ మిల్లు కాలనీ ప్రాథమిక పాఠశాలలో జేసీ సతీమణి లక్ష్మీ చేర్పించారు. శృతి 6వ తరగతి, ధరణ్‌రెడ్డి 4వ తరగతిలో అడ్మిషన్ పొందారు
 
రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలు నాడు-నేడు పేరుతో అభివృద్ధి చేసింది. పాఠశాలల రూపురేఖలు మారిపోయి కార్పొరేట్ స్కూళ్లను తలపిస్తున్నాయి. దీనికి తోడు ఇంగ్లిష్ మీడియం కూడా అందిస్తుండటం తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇలా అధికారులు కూడా తమ పిల్లలను సర్కారీ బడులకు పంపుతుండటంతో సాధారణ ప్రజలు మరింత స్ఫూర్తి పొందే అవకాశముంది.