కుమార్తెను వేధిస్తున్నాడనీ... అల్లుడిని స్తంభానికి కట్టేసి చితకబాదారు.. ఎక్కడ?

crime scene
ఠాగూర్| Last Updated: బుధవారం, 24 ఫిబ్రవరి 2021 (12:04 IST)
తమ కుమార్తెను వరకట్నం తేవాలంటూ హింస పెడుతున్న అల్లుడుని అత్తింటివారు కరెంట్ స్తంభానికి కట్టేసి చితకబాదారు. ఈ ఘటన ఒరిస్సా రాష్ట్రంలోని కొరాపుట్‌ జిల్లా సెమిలిగుడ సమితిలోని మాలిగొంజ గ్రామంలో జరిగింది.

తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, సెమిలిగుడ సమితిలోని మాలిమొరియ గ్రామానికి చెందిన లొఖి ఖొర అనే యువకుడు, మాలిగొంజ గ్రామానికి చెందిన ధనేశ్వర గొలారిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వివాహమైన కొన్నాళ్లకు కట్నం తీసుకు రమ్మని భార్యను వేధిస్తూ కొట్టడం ప్రారంభించాడు.

అంతేకాకుండా ఆమెను సోమవారం కన్నవారింటికి తీసుకుని బయలు దేరాడు, మార్గంలో ఆమెను అమానుషంగా కొట్టి దారిలోనే విడిచిపెట్టి వెళ్లిపోయాడు. విషయం తెలుసుకున్న అత్తింటివారు ఆగ్రహోదగ్రులై అల్లుడిని మంగళవారం గ్రామానికి తీసుకువచ్చి గ్రామం మధ్యలో గల విద్యుత్‌ స్తంభానికి కట్టేసి చితకబాదారు.

ఈ దృశ్యాలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొట్టడంతో విషయం తెలిసిన పొట్టంగి పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి

స్పృహతప్పిన ఆ యువకుడిని రక్షించారు. మొదట అతడిని పొట్టంగి హాస్పిటల్‌లో చేర్చారు. అక్కడినుంచి కొరాపుట్‌లోని సహిద్‌ లక్ష్మణ నాయక్‌
వైద్య కళాశాల హాస్పిటల్‌లో చేర్చారు. ఈ సంఘటనపై ధనేశ్వరి, లొఖి ఖొర కుటుంబ సభ్యులు పోలీసులకు పరస్పరం
ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.దీనిపై మరింత చదవండి :