ఆదివారం, 1 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 27 సెప్టెంబరు 2022 (08:09 IST)

అమెరికాలో ఘోరం.. తానా డైరెక్టర్ భార్య, ఇద్దరు పిల్లలు దుర్మరణం

yalamanchili vani and daughters
అమెరికాలో ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) బోర్డు డైరెక్టర్ డాక్టర్ కొడాలి నాగేంద్ర శ్రీనివాస్ యాదవ్ భార్య, ఆయన ఇద్దరు కుమార్తెలు దుర్మరణం పాలయ్యారు. కుమార్తెను కాలేజీ నుంచి తీసుకొస్తుండగా జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ప్రమాద స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. ఒకేసారి భార్యాపిల్లలు ఇకలేరన్న వార్త తెలియగానే కొడాలి నాగేంద్ర శ్రీనివాస్ షాక్‌లోకి వెళ్లిపోయారు. 
 
కృష్ణా జిల్లా కురుమద్దాలికి చెందిన నాగేంద్ర శ్రీనివాస్ ఉన్నత విద్యను అభ్యసించేందుకు గత 1995లో అమెరికా వెళ్లారు. తన విద్యాభ్యాసం పూర్తి చేసిన తర్వాత పీడియాట్రిక్ కార్డియోవాస్కులరో అనస్థీషియాలజిస్టుగా పని చేస్తూ హ్యూస్టన్‌లో స్థిరపడ్డారు. గత 2017 నుంచి తానా బోర్డులో డైరెక్టరుగా పని చేస్తున్నారు. 
 
ఈ నేపథ్యంలో శ్రీనివాస్ భార్య యలమంచిలి వాణి ఆదివారం ఉదయం 11.30 గంటలకు కాలేజీ తన ఇద్దరు కుమార్తెలను తీసుకొచ్చేందుకు కారులో వెళ్లారు. కాలేజీ నుంచి వారిద్దరిని కారులో ఎక్కించుకుని బయలుదేరారు. వీరి కారు టెక్సాస్ వాలర్ కౌంటీలో వస్తుండగా కారును ఓ వ్యాను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, ఒకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. 
 
వాణి ఐటీ ఉద్యోగి కాగా, పెద్ద కుమార్తె వైద్య విద్యను అభ్యసిస్తుంది. రెండో అమ్మాయి 11వ తరగతి  చదువుతోంది. ప్రమాదంలో భార్య, ఇద్దరు కుమార్తెలు దుర్మరణం పాలయ్యారన్న వార్త తెలుసుకున్న నాగేంద్ర శ్రీనివాస్ షాక్‌లోకి వెళ్లిపోయారు. సమచారం తెలుసుకున్న తానా సభ్యులు, సన్నహితులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తి వ్యక్తం చేస్తూ, మిగిలిన కార్యక్రమాలను పూర్తి చేసే పనుల్లో నిమగ్నమయ్యారు.