సోమవారం, 27 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 8 నవంబరు 2020 (16:28 IST)

సీఎం జగన్ పాలన ఈ ట్రైలర్ చూస్తే చాలు... హతవిధీ : చంద్రబాబు

వైసీపీ ఏడాది పాలనలో ప్రజలు ఎంత విసుగెత్తిపోయారో, బూటకపు మాటలను నమ్మి ఎంత మోసపోయారో చెబుతున్న వీడియో ఇది. తొలి ఏడాది పాలన ఏ ప్రభుత్వానికైనా కీలకం. ట్రైలర్ చూస్తేనే ఇలా ఉంటే రాబోయే కాలం ఇంకెలా బెంబేలెత్తిస్తారో..! హతవిధీ అంటూ టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. నంద్యాలలో అబ్దుల్ సలాం అనే వ్యక్తి కుటుంబ సభ్యులంతా రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటనపై చంద్రబాబు వరుస ట్వీట్లు చేశారు. 
 
నంద్యాలలో అబ్దుల్ సలాం, నూర్జహాన్ దంపతులు పిల్లలతో సహా రైలుకింద పడి ఆత్మహత్య చేసుకుని మరణించడం విచారకరం. సలాం కుటుంబ సభ్యుల ఆత్మహత్యకు ప్రభుత్వం నైతిక బాధ్యత వహించాలి. ముస్లింలను వేధింపులకు గురిచేస్తూ, అక్రమ కేసులు పెడుతున్నారు అనేందుకు సలాం కుటుంబం ఆత్మహత్యే నిదర్శనం. 
 
నాడు శాసనమండలిలో సభ్యులందరిముందు ఛైర్మన్ షరీఫ్‌ని మతం పేరుతో దూషించారు. రాజమండ్రిలో పదేళ్ళ ముస్లిం బాలికపై అత్యాచారయత్నం చేసిన వారిపై కేసు పెడితే.. కేసు వెనక్కు తీసుకోవాలని వైసీపీ నేతలు బాలిక తండ్రి సత్తార్‌పై ఒత్తిడి తేవడంతో ఆయన ఆత్మహత్య వరకు వెళ్ళారు. 
 
ఈరోజు చెయ్యని నేరాన్ని ఒప్పుకోమని అధికారులు వేధించడంతో ఒక నిండు కుటుంబం బలైపోయింది. రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపులో ఉన్నాయి అంటున్న ప్రభుత్వం... దీనికి ఏమని సమాధానం చెప్తుంది? నంద్యాల ఘటను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఈ ఘటనకు బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలి. ముస్లిం మైనారిటీల పట్ల ప్రభుత్వం తన నిర్లక్ష్య వైఖరి వీడాలి అంటూ వరుస ట్వీట్లు చేశారు.