రాళ్లు, కర్రలు, కారంతో టీడీపీ కార్యకర్తలే వైస్సార్సీపీపై దాడి చేసారు
ప్రత్తిపాడు నియోజకవర్గం కొప్పర్రు గ్రామంలో గాయపడిన వైస్సార్సీపీ నాయకులను హోంమంత్రి సుచరిత పరామర్శించారు. పెదనందిపాడు మండలం కొప్పర్రులో టీడీపీ నాయకులపై దాడి జరిగిందని అవాస్తవాలను ప్రచారం చేశారని... రాళ్లు, కర్రలు, కారంతో టీడీపీ కార్యకర్తలే వైస్సార్సీపీ వాళ్లపై దాడి చేసారని మంత్రి పేర్కొన్నారు. టీడీపీ వాళ్ళ దాడిలో దాదాపు పది మంది వైస్సార్సీపీ నాయకులకు తీవ్ర గాయాలు అయ్యాయని చెప్పారు.
వినాయక నిమజ్జనం చేసి వస్తున్న వైస్సార్సీపీ నాయకులతో కావాలనే టీడీపీ వాళ్ళు గొడవకు దిగారని, దాదాపు 40 మంది టీడీపీ వాళ్ళు వైస్సార్సీపీ వాళ్లపై కర్రలతో దాడి చేశారని హోంమంత్రి సుచరిత వివరించారు. టీడీపీ వాళ్ల దాడిలో వైస్సార్సీపీ నాయకుడు ఇంటూరి హనుమంతరావుకు తీవ్ర గాయాలు అయ్యాయన్నారు. ఎందుకిలా దాడి చేశారని ప్రశ్నించడానికి వెళ్లిన హనుమంతరావు కుమారుడు ఇంటూరి శ్రీకాంత్ ను టీడీపీ ఎక్స్ జడ్పీటీసీ ఇంట్లోకి లాక్కెళ్లి చితకొట్టారని తెలిపారు.
శ్రీకాంత్ ను రక్షించడానికి వెళ్లిన వైస్సార్సీపీ నాయకులపై మరోసారి రాళ్లతో, కర్రలతో దాడి చేసినట్లు చెబుతున్నారని, ఆ క్రమంలో టీడీపీ నాయకుడి ఇంట్లోని ఒక సోఫా తగలబడటం జరిగిందన్నారు. గాయాలపాలయిన వైస్సార్సీపీ కార్యకర్తలు, నాయకులను స్థానిక పోలీసులు అంబులెన్స్ లో హాస్పిటల్ కు తరలించారు. దాడి చేసిన టీడీపీ వాళ్ళే తిరిగి వైస్సార్సీపీ నాయకులపై కేసులు పెట్టారని సుచరిత తెలిపారు.
టీడీపీ నాయకులపై దాడి, ఇంటిని ధ్వంసం చేసారు అని టీడీపీ వాళ్లే మీడియాలో అసత్య ప్రచారాన్ని ప్రచారం చేయించారన్నారు. వాస్తవ విషయాలు సమాజానికి, మీడియాకు తెలియాలనే తాను కొప్పర్రు గ్రామానికి రావడం జరిగిందన్నారు. ప్రశాంతమైన కొప్పర్రు గ్రామంలో కావాలనే టీడీపీ నాయకులు విధ్వంసం సృష్టించాలని చూస్తున్నారని ఆరోపించారు. కొప్పర్రు లో దాడికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని హోంమంత్రి సుచరిత పోలీసులకు సూచించారు.
మీడియా ప్రతినిధులు కూడా వాస్తవాలను ప్రసారం చేయాలని హోంమంత్రి సుచరిత కోరారు. భవిష్యత్తులో కొప్పర్రు గ్రామంలో ఎలాంటి గొడవలు జరగకుండా ప్రశాంతంగా వుండాలని హోంమంత్రి విజ్ఞప్తి చేశారు.