వెస్ట్ బెంగాల్‌లో ఎన్నికల తర్వాత హింస : సీబీఐకు విచారణ
పశ్చిమ బెంగాల్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల తర్వాత హింస చెలరేగింది. ఈ హింసకు సంబంధించిన విచారణను గురువారం హైకోర్టు సీబీఐకి అప్పగించింది. సీబీఐతోపాటు కోర్టు ఆధ్వర్యంలోని స్పెషల్ ఇన్వెస్టిగేటింగ్ టీమ్ కూడా ఈ కేసును పర్యవేక్షించనుంది.
తాత్కాలిక చీఫ్ జస్టిస్ రాజేష్ బిందాల్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఈ పిటిషన్లపై విచారణ జరిపింది. ఈ ఏడాది మే 2న తృణమూల్ కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో తీవ్ర హింస చెలరేగింది. దీనిపై ఎంతో మంది పిటిషనర్లు హైకోర్టు గడప తొక్కారు.
దీంతో హైకోర్టు ఆదేశాల మేరకు జాతీయ మానవ హక్కుల కమిషన్ కూడా ఓ కమిటీ ఏర్పాటు చేసి దీనిపై విచారణ జరిపింది. జులై 15న దీనికి సంబంధించిన తుది నివేదికను కోర్టుకు సమర్పించింది.
అధికార పార్టీ మద్దతుదారులు ప్రతిపక్ష పార్టీ మద్దతుదారులపై జరిపిన ప్రతీకార హింసగా దీనిని కమిటీ అభివర్ణించింది. హత్య, అత్యాచారం వంటి తీవ్రమైన ఆరోపణలు ఉన్న నేపథ్యంలో కేసు విచారణను సీబీఐకి అప్పగించాలని, అంతేకాదు ఈ విచారణ రాష్ట్రం బయట జరగాలని కూడా స్పష్టం చేసింది.