శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 18 ఆగస్టు 2021 (13:08 IST)

సీబీఐ పంజరంలో రామ చిలుకనా? మద్రాస్ హైకోర్టు ఏమన్నది?

దేశంలోనే అత్యున్న దర్యాప్తు సంస్థగా ఉన్న జాతీయ దర్యాప్తు సంస్థ (సీబీఐ) స్వతంత్రపై మద్రాస్ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. సీబీఐను ఒక పంజరంలో రామచిలుకగా అభివర్ణించింది. ఆ పంజరం నుంచి సీబీఐను వదిలిపెట్టాలంటూ పాలకులను ఆదేశించింది. 
 
ముఖ్యంగా, కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీజేపీ పాలకుల చేతుల్లో సీబీఐ కీలుబొమ్మలా మారిందంటూ ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయని పేర్కొంది. ఎన్నికల సంఘం, కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) మాదిరిగానే సీబీఐ కూడా స్వతంత్ర సంస్థలా ఉండాలని, అది కేవలం పార్లమెంట్‌కే నివేదించాలని సూచించింది. 2కే రిపోర్ట్ చేయాలని సూచించింది.
 
తమిళనాడులో జరిగిన పోంజీ స్కీమ్ అక్రమాలపై సీబీఐ దర్యాప్తు జరిపించాల్సిందిగా కోరుతూ దాఖలైన పిటిషన్‌పై జస్టిస్ ఎన్. కిరుబాకరన్, జస్టిస్ బి. పుగళెందిల ధర్మాసనం విచారణ జరిపింది. ఈ సందర్భంగానే ఆ వ్యాఖ్యలు చేసింది. సీబీఐ వ్యవస్థలో మార్పులకు కోర్టు 12 పాయింట్ల నిర్మాణాత్మక సూచనలను చేసింది. 
 
సీబీఐకి చట్టబద్ధ హోదా ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ‘‘వీలైనంత త్వరగా సీబీఐ అధికారాలు, పరిధులు పెంచి.. సంస్థకు చట్టబద్ధ హోదా ఇచ్చేలా కేంద్ర ప్రభుత్వం ఓ చట్టాన్ని చేయాలి. సీబీఐపై ప్రభుత్వ పెత్తనం లేకుండా చూడాలి’’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది.
 
డీవోపీటీకి కాకుండా నేరుగా ప్రధాన మంత్రి లేదా మంత్రికే రిపోర్ట్ చేసేలా కార్యదర్శి స్థాయి హోదాను సీబీఐ డైరెక్టర్‌కు ఇవ్వాలని ఆదేశించింది. ఎక్కువ మంది సిబ్బంది లేరని పోంజీ స్కీమ్‌ను బదిలీ చేసేందుకు కేంద్రం నిరాకరించడంతో.. సంస్థలో వెంటనే కేడర్ సామర్థ్యాన్ని పెంచాల్సిందిగా కేంద్రాన్ని హైకోర్టు ఆదేశించింది. 
 
నెలలోపు నియామకాలు చేపట్టాలని సూచించింది. అమెరికా ఎఫ్‌బీఐ, బ్రిటన్ స్కాట్లాండ్ యార్డ్‌లాగా సీబీఐని బలోపేతం చేయాలని, అందుకు ప్రత్యేక బడ్జెట్‌ను కేటాయించాలని కేంద్రానికి ఆదేశాలిచ్చింది. కాగా, గత యూపీఏ ప్రభుత్వ హయాంలో కూడా సుప్రీంకోర్టు ఇదే తరహా వ్యాఖ్యలు చేసిన విషయం తెల్సిందే.