శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : సోమవారం, 3 మే 2021 (23:49 IST)

బాలయ్య ఇచ్చిన వెంటిలేటర్లు అమర్చలేదు, సీఎం జగన్‌కు అర్హత లేదు: పరిటాల సునీత

హిందూపురం ప్రభుత్వ ఆస్పత్రి ఘటనపై మాజీ మంత్రి పరిటాల సునీత స్పందించారు. హిందూపురం ప్రభుత్వాస్పత్రిలో ఆక్సిజన్ అందక రోగుల మృతి బాధాకరమని అన్నారు. రోగులకు ఆక్సిజన్ అందించలేని జగన్మోహన్ రెడ్డికి అధికారంలో ఉండే అర్హత లేదని తెలిపారు.
 
రెండు రోజుల వ్యవధిలో హిందూపురం ఆస్పత్రిలో 12 మంది మృతిచెందారని... మృతుల కుటుంబసభ్యులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఆక్సిజన్ సకాలంలో అందక ప్రజల ప్రాణాలు పోతుంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్‌లో కూర్చుని చోద్యం చూడటం సిగ్గుచేటని మండిపడ్డారు. 
 
ముఖ్యమంత్రి అసమర్థతకు, వైసీపీ ప్రభుత్వ బాధ్యతారాహిత్యానికి మరెంతమంది బలికావాలని ప్రశ్నించారు. అనంతపురం సర్వజన ఆస్పత్రి, కర్నూలు కేఎస్ కేర్ ఆస్పత్రుల్లో ప్రాణవాయువు అందక ఇప్పటికే 26మందికి పైగా  చనిపోయారని తెలిపారు.
 
కరోనా సోకిందనే బాధకంటే ఆక్సిజన్ దొరుకుతుందా లేదా అనే ఆందోళన రోగులను మరింత కుంగతీస్తోందని చెప్పారు. ఎంతసేపూ ప్రత్యర్థులను ఎలా ఇబ్బంది పెట్టాలని, మోసపూరిత మాటలతో రాజకీయ పబ్బం ఎలా గడుపుకోవాలని అనే వాటిపైనే జగన్మోహన్ రెడ్డి దృష్టి పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 
 
కరోనా మొదటి దశ ఉధృతి సమయంలోనే హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ వెంటిలేటర్లను అందజేస్తే వాటిని ఇంతవరకూ ఆస్పత్రిలో అమర్చనే లేదన్నారు. తమ నిర్లక్ష్యానికి అమాయక ప్రజలను బలిచేస్తారా? అని నిలదీశారు.
 
 ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి నిర్లక్ష్యం వీడాలని....తాడేపల్లి ప్యాలెస్ దాటి ప్రభుత్వ ఆస్పత్రులను సందర్శించాలన్నారు. ఆక్సిజన్, బెడ్లు, రెమ్ డెసివిర్ కొరతపై దృష్టి పెట్టి తగిన చర్యలు తీసుకోవాలని పరిటాల సునీత డిమాండ్ చేశారు.