గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : బుధవారం, 13 సెప్టెంబరు 2023 (10:19 IST)

ఇలాంటి చర్యల వల్లే ఏపీలో బీజేపీ బలపడలేకపోతుంది : పురంధేశ్వరి

purandheswari
స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌లో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడును అరెస్టయ్యారు. ఈ నేపథ్యంలో పార్టీ శ్రేణులను ఉద్దేశించి ఏపీ బీజేపీ శాఖ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి చర్యల వల్లే ఏపీలో బలపడలేకపోతుందని ఆమె అభిప్రాయపడ్డారు. పైగా, పార్టీలో గ్రూపులకు తావులేదని... ఎవరూ కూడా గ్రూపులు కట్టే ప్రయత్నం చేయవద్దని హెచ్చరించారు.
 
పార్టీలో ఉన్న గ్రూపు రాజకీయాల వల్ల రాష్ట్రంలో ఇన్నేళ్లుగా బలపడలేకపోయామన్నారు. పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరూ ఇకపై పార్టీ కోసమే పని చేయాలని సూచించారు. అధికారంలోకి వస్తామనే ఆత్మవిశ్వాసంతో పని చేయాలని చెప్పారు. మండల స్థాయిలో కూడా కమిటీలను వేసుకోకపోతే... పార్టీ ఎలా బలపడుతుందని పురందేశ్వరి ప్రశ్నించారు. పోలింగ్ బూత్ స్థాయి వరకు కమిటీలను వేసుకోవాల్సిందేనని చెప్పారు. జిల్లా స్థాయి కమిటీలు స్థానిక సమస్యలపై ప్రజల తరపున పోరాడాలని తెలిపారు. 
 
ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వ విజయాలు, కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను సోషల్ మీడియా ద్వారా ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని సూచించారు. క్షేత్ర స్థాయిలో పని చేసే కార్యకర్తలకు కూడా బాధ్యతలను అప్పగించినప్పుడే పార్టీ బలపడుతుందన్నారు. సర్పంచ్‌ల సమస్యలపై క్షేత్ర స్థాయిలో చేపట్టిన ఉద్యమం విజయవంతమయిందని, ఈ ఉద్యమం ద్వారా మన పార్టీ గొంతుకను బలంగా వినిపించామన్నారు. ఎట్టి పరిస్థితుల్లో పార్టీకి వచ్చే విరాళాలను నగదు రూపంలో తీసుకోవద్దని స్పష్టంచేశారు.