ఆదివారం, 5 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : సోమవారం, 11 సెప్టెంబరు 2023 (21:00 IST)

చంద్రబాబు నాయుడిపై అపనిందలు వేయొద్దు... నా పిల్లలకు ఖర్చు చేసిన డబ్బులు చెల్లిస్తా...

abburi srinivasulu
స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిని ఏపీ సీఐడీ పోలీసులు అరెస్టు చేయడాన్ని చాలా మంది నెటిజన్లు కూడా తప్పుపడుతున్నారు. చంద్రబాబు అలాంటి వ్యక్తి కాదని వారు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. తాజాగా తిరుపతికి చెందిన అబ్బూరి శ్రీనివాసులు అనే వ్యక్తి పెట్టిన పోస్టు ఇపుడు చర్చనీయాంశంగా మారింది. "చంద్రబాబుపై పడిన అపనిందను తొలగించేందుకు నా ఇద్దరు కుమార్తెల స్కిల్ డెవలప్‌మెంట్ ట్రైనింగ్ కోసం ప్రభుత్వం పెట్టిన ఖర్చును కట్టేస్తాం" అంటూ ఆయన ముందుకొచ్చారు. తద్వారా చంద్రబాబు అరెస్టు అక్రమమని ఆయన చెప్పారు. ఈ పోస్టును నెటిజన్లు లైక్ చేస్తూ ట్వీట్ చేస్తున్నారు. 
 
అబ్బూరి శ్రీనివాసులు తన ఫేస్‌బుక్ ఖాతాలో పెట్టిన పోస్టును పరిశీలిస్తే, 'బీటెక్‌ చదివేటప్పుడు స్కిల్ డెవలప్‌మెంట్‌ ట్రైనింగ్ పొందిన తర్వాత నా పెద్ద కుమార్తె, ఇతర విద్యార్థినులు 2017 ఏప్రిల్‌లో అమరావతికి వెళ్లి అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబుని, నాటి మంత్రి కొల్లు రవీంద్రని కలిసినప్పటి ఫొటోలివీ. నా చిన్న కుమార్తె బీబీఏ చదివేటప్పుడు స్కిల్ డెవలప్‌మెంట్‌ ట్రైనింగ్ తీసుకుంది. ఇప్పటి ప్రభుత్వం అంటున్న ఆ రూ.370 కోట్ల నుంచే నా ఇద్దరు కుమార్తెలు శిక్షణ తీసుకున్నారు. ఆ సొమ్ము చంద్రబాబు దోచుకుని ఉంటే నా కుమార్తెలకు శిక్షణ ఎవరి డబ్బుతో ఇచ్చారు?' అంటూ సూటిగా ప్రశ్నించారు. 
 
'కావాలంటే నా కుమార్తెల శిక్షణకు ప్రభుత్వం ఎంత ఖర్చు పెట్టిందో చెబితే.. నేను కట్టేస్తాను. ఆ మొత్తం నుంచి నేను కట్టే సొమ్మును మినహాయించండి. ఎంతో మంది క్యాంపస్ ఇంటర్వ్యూలలో సెలెక్ట్ అయి మంచి జీతాలతో ఉద్యోగాలు చేయగలిగే పరిస్థితి కల్పించిన ఆ మహానుభావుడు చంద్రబాబు. నా కుమార్తెల లాంటి వారి భవిష్యత్తు కోసం ఖర్చు పెట్టిన సొమ్మును దోచుకున్నాడనే మచ్చ రావడం నాకు, నా కుమార్తెలకు, నా భార్యకు చాలా బాధను కలిగిస్తోంది' అని రాసుకొచ్చారు.
 
అబ్బూరి శ్రీనివాసులు పోస్ట్‌కు ఫేస్‌బుక్‌లో నెటిజన్ల నుంచి మంచి స్పందన వస్తోంది. మీరు చెప్పింది నిజమే, చంద్రబాబు అలాంటి తప్పు చేయరు అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరోవైపు నైపుణ్యాభివృద్ధి సంస్థ శిక్షణ తీసుకొని ప్రస్తుతం ఉద్యోగాలు చేస్తున్నవాళ్లు, మంచి స్థానంలో ఉన్నవాళ్లు చంద్రబాబుకు అండగా నిలవాలని నెటిజన్లు కోరుతున్నారు.