గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 8 సెప్టెంబరు 2023 (12:19 IST)

ఉక్రెయిన్ - రష్యా యుద్ధ సమయంలో భారత్ నిర్ణయం సరైనదే : మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్

manmohan singh
ఉక్రెయిన్ - రష్యా దేశాల మధ్య జరిగిన యుద్ధంలో భారత్ తటస్థంగా ఉండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీసుకున్న నిర్ణయం సరైనదే అని కాంగ్రెస్ వృద్ధనేత, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అభిప్రాయపడ్డారు. జీ-20 శిఖరాగ్ర సదస్సుకు ఢిల్లీ ఆతిథ్యమిస్తున్న తరుణంలో ఆయన.. ప్రధాని మోడీ నిర్ణయాన్ని సమర్థిస్తూ చేసిన వ్యాఖ్యలు కీలకంగా మారాయి. 
 
జీ-20 సదస్సుకు భారతదేశం నాయకత్వం వహించడం తనకు చాలా సంతోషాన్ని కలిగిస్తోందన్నారు. తన జీవితకాలంలోనే ఈ గొప్ప అవకాశం రావడం, సమావేశాలను చూడడం ఆనందంగా ఉందన్నారు. భారత దేశానికి విదేశాంగ విధానం అనేది చాలా ముఖ్యమని, ప్రస్తుత కాలంలో దీని ప్రాముఖ్యత మరింత పెరిగిందన్నారు. దేశ రాజకీయాల్లో కూడా విదేశీ వ్యవహారాలు కీలకంగా మారాయని గుర్తు చేశారు. 
 
అయితే, జీ20 సమావేశాలకు చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ గైర్హాజరు కావడం దురదృష్టకరమని అన్నారు. లడఖ్ సరిహద్దుల్లో చైనాతో నెలకొన్న ఉద్రిక్తతల విషయంలో ప్రధాని మోడీ జాగ్రత్తగా వ్యవహరిస్తారని, దేశ భూభాగాన్ని కాపాడుకునే అవసరమైన చర్యలు తీసుకుంటారని ఆయన అభిప్రాయపడ్డారు. 
 
ఉక్రెయిన్‌పై రష్యా దురాక్రమణ సమయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని మన్మోహన్ సింగ్ మెచ్చుకున్నారు. రెండు దేశాల మధ్య యుద్ధం జరుగుతున్నపుడు ఎవరో ఒకరివైపు నిలబడేలా ప్రపంచ దేశాలపైన ఒత్తిడి పెరుగుతుందన్నారు. 
 
అయితే, భారత దేశం ఈ ఒత్తిడికి తలొగ్గకుండా తటస్థంగా ఉండడం, దేశ సార్వభౌమత్వాన్ని, ఆర్థిక ఆకాంక్షలను దృష్టిలో పెట్టుకుని వ్యవహరించడం గొప్ప నిర్ణయమని కొనియాడారు. ఈ విషయంలో ప్రధాని నరేంద్ర మోడీ సర్కారు సరైన నిర్ణయం తీసుకుందని చెప్పారు.