నాకు నా కుమారుడే ముఖ్యం... ఇబ్బంది పెడితే కచ్చితంగా నేనూ బదులిస్తా: ఎమ్మెల్యే మైనంపల్లి
తనకు తన కుమారుడే ముఖ్యమని తెరాస ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు మరోమారు స్పష్టం చేశారు. సోమవారం తాను పార్టీ గురించి మాట్లాడలేదని.. తన వ్యక్తిగత అభిప్రాయాలను వెల్లడించానని చెప్పారు. తిరుమలలో మరోసారి శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్ వెళ్లాక తన కార్యాచరణ వెల్లడిస్తానని మైనంపల్లి తెలిపారు.
'నాకు నా కుమారుడే ముఖ్యం. జీవితంలో నేను ఎవరినీ ఇబ్బంది పెట్టలేదు. నన్ను ఇబ్బంది పెడితే ఖచ్చితంగా నేనూ బదులిస్తా. మెదక్, మల్కాజిగిరి కార్యకర్తలే నాకు ప్రాధాన్యం. నేను ఏ పార్టీనీ విమర్శించను. పార్టీలకు అతీతంగా ఉంటా. మా అబ్బాయికి టికెట్ ఇస్తే.. గెలిపించుకుని వస్తా' అని మైనంపల్లి హన్మంతరావు అన్నారు.
తనకు మల్కాజిగిరితో పాటు తన కుమారుడు రోహిత్‌కు మెదక్ టికెట్ ఇస్తేనే భారాస తరపున పోటీ చేస్తానని.. లేకుంటే స్వతంత్రంగా బరిలోకి దిగుతానని సోమవారం మైనంపల్లి హన్మంతరావు వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మంత్రి హరీశ్‌రావు మెదక్‌లో పెత్తనం చెలాయిస్తున్నారంటూ ఆయన తీవ్ర విమర్శలు చేశారు. అవసరమైతే హరీశ్‌పై పోటీ చేస్తానని పేర్కొన్నారు.
అయితే మైనంపల్లికి మల్కాజిగిరి టికెట్ ఖరారు చేసిన భారాస.. మెదక్ టికెట్‌ను మాత్రం ఆయన కుమారుడికి ఇవ్వలేదు. అక్కడ మాజీ ఉపసభాపతి పద్మాదేవేందర్ రెడ్డికి టికెట్‌ను కేటాయించింది. మరోవైపు హరీశ్‌రావుపై మైనంపల్లి చేసిన వ్యాఖ్యలను మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మరోసారి మైనంపల్లి స్పందించడం గమనార్హం.