శనివారం, 21 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 1 జనవరి 2024 (09:51 IST)

టీ తాగేందుకు వెళ్లిన ముగ్గురు యువకులు దుర్మరణం.. ఎలా?

car accident
ఏపీలోని ప్రకాశం జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. తెలతెలవారుతుండగానే ముగ్గురు యువకులు మృత్యువాతపడ్డారు. ఈ ముగ్గురు యువకులు టీ తాగేందుకు వెళుతూ ప్రాణాలు కోల్పోవడంతో స్థానికంగా తీవ్రవిషాదం నెలకొంది. జిల్లాలోని బెస్తవారి పేట మండలం, శెట్టిచెర్ల అడ్డురోడ్డు వద్ద సోమవారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. 
 
పాపాయిపల్లికి చెందిన పవన్ (20), రాహుల్ (21), శ్రీనివాస్ (21) అనే ముగ్గురు స్నేహితులు కలిసి టీ తాగేందుకు ద్విచక్రవాహనంపై పందిళ్లపల్లి సమీపంలోని టోల్‌ప్లాజా వద్దకు బయలుదేరారు. ఈ క్రమంలో ఎదురుగా గిద్దలూరు నుంచి బెస్తవారి పేట వైపు వస్తున్న బొలెరో వాహనం అదుపు తప్పి వేగంగా వచ్చిన ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. 
 
ఈ ప్రమాదంలో ముగ్గురు యువకులు ప్రమాద స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మూడు మృతదేహాలను స్వాధీనం చేసుకుని శవపరీక్ష కోసం ఆస్పత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.