రోడ్డు ప్రమాదంలో ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ దుర్మరణం
ఏపీలో శుక్రవారం జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో ఎమ్మెల్యే షేక్ సాబ్జీ దుర్మరణం పాలయ్యారు. ఈయన పీడీఎఫ్ నుంచి శాసనమండలికి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఏలూరు నుంచి భీమవరం వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ఉండి మండలం చెరుకువాడ సమీపంలో రెండు కార్లు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఆయన ప్రాణాలు కోల్పోయాడు. తమ డిమాండ్ల పరిష్కారం కోసం ఆందోళన చేస్తున్న అంగన్ వాడీ వర్కర్ల సమ్మెలో పాల్గొని వెళుతుండగా, ఈ ప్రమాదం జరిగింది. షేక్ సాబ్జీ మృతిపట్ల పార్టీలకు అతీతంగా రాజకీయ నేతలు తమ ప్రగాఢ సంతాపాన్ని సానుభూతిని తెలిపారు.
మరోవైపు, షేక్ సాబ్జీ మృతిపై టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తన ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు. రోడ్డు ప్రమాదంలో షేక్ సాబ్జీ మరణించడం అత్యంత విషాదకరమన్నారు. అంగన్ వాడీ వర్కర్లకు మద్దతు తెలిపి అంతలోనే ఆయన అనంతలోకాలకు చేరుకోవడం విచారకరమన్నారు. తన చివరి ఘడియల్లో సైతం ఆయన ప్రజా సేవలోనే గడిపారని గుర్తుచేశారు. ఈ విషాద సమయంలో సాబ్జీ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్టు పేర్కొన్నారు.
ప్రయాణ టిక్కెట్ - పాస్ పోర్టు - వీసా లేకుండా దేశాలు దాటేశాడు.. ఎలా?
రష్యా పౌరుడు ఒకడు ఎలాంటి ప్రయాణ టిక్కెట్, వీసా, పాస్‌పోర్టు, బోర్డింగ్ ఇలాంటివి ఏవీ లేకుండా ఏకంగా దేశాల సరిహద్దులను దాటేశాడు. చివరకు విమానాశ్రయ భద్రతా సిబ్బంది చిక్కాడు. ఎలాంటి ధృవీకరణ పత్రాలు లేకుండా ఎలా వచ్చావని అడిగితే తనకు ఏమీ గుర్తు లేదని చెప్పి షాకిచ్చాడు. అయితే, ఈ ఘటన గత నెలలో జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ వివరాలను పరిశీలిస్తే,
రష్యాకు చెందిన సెర్గెయ్ వ్లాదిమిరోవిచ్ ఒచిగవా అనే వ్యక్తి ఇజ్రాయెల్ దేశంలో స్థిరపడ్డారు. నవంబర్ నాలుగో తేదీన ఆయన డెన్మార్క్‌లోని కోపెన్ హాగెన్ ఎయిర్ పోర్ట్ నుంచి అమెరికాలోని లాస్ఏంజిలిస్‌కు ప్రయాణించారు. అయితే, ఈ ప్రయాణానికి సంబంధించి ఆయన ఎలాంటి డాక్యుమెంట్లు తీసుకోలేదు. పాస్‌పోర్ట్ వెంట తీసుకెళ్లలేదు, టికెట్ కొనలేదు, వీసా కూడా లేదు.. అంతెందుకు విమానంలోకి ఎంటర్ కావడానికి తప్పనిసరి అయిన బోర్డింగ్ పాస్ కూడా ఒచిగవా దగ్గర లేదు. అయినా విమానం ఎక్కి దేశాలు దాటి ప్రయాణించాడు.
ఎలాంటి పత్రాలు లేకుండా విమానం దిగిన ఒచిగవాను చూసి లాస్ఏంజిలిస్ ఎయిర్ పోర్ట్ సిబ్బంది ఆశ్చర్యపోయారు. ఇతర విమానాలలో వచ్చాడేమోనని మిగతా ప్రయాణికుల వివరాలను పరిశీలించారు. ఆ రోజు వచ్చిన విమానాలే కాదు అంతకుముందు రెండు మూడు రోజుల ప్రయాణికుల జాబితాలోనూ ఒచిగవా పేరులేదు. దీంతో ఇదెలా సాధ్యమైందని అధికారులు తలలు పట్టుకుంటున్నారు.
ఒచిగవాను అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా.. మూడు రోజులుగా తనకు నిద్రలేదని, అసలు విమానం ఎలా ఎక్కానో కూడా తనకు గుర్తులేదని చెప్పాడు. ప్రయాణం మధ్యలో ఒచిగవా పలుమార్లు సీట్లు మారాడని, భోజనం కోసం ఒకటికి రెండుసార్లు రిక్వెస్ట్ చేశాడని ఫ్లైట్ అటెండెంట్స్ చెప్పారు. ఒచిగవా కాస్త అశాంతిగా కనిపించాడని విచారణలో వెల్లడించారు. కాగా, ఈ ఘటనపై అమెరికా నేర పరిశోధనా సంస్థ ఎఫ్‌బీఐ ప్రస్తుతం విచారణ జరుపుతోంది.