ఆదివారం, 3 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 17 ఏప్రియల్ 2022 (15:26 IST)

నెల్లూరు జిల్లా కోర్టులో చోరీ : ఇద్దరు అరెస్టు

arrest
ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన చోరీ కేసులో ఇద్దరు పాత నేరస్తులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ విషయాన్ని జిల్లా ఎస్పీ విజయరావు వెల్లడించారు. ఈ సందర్భంగా చోరీకి గురైన వస్తువులన్నింటినీ రికవరి చేశామని ఆయన తెలిపారు. 
 
ఈ కోర్టులో జరిగిన చోరీ కేసులో పాత నిందితులు సయ్యద్‌ హయత్‌, ఖాజా రసూల్‌ను అరెస్టు చేశామని ఆయన తెలిపారు. కోర్టు ప్రాంగణంలో ఇనుము చోరీకి వెళ్లిన ఇద్దరిని కుక్కలు వెంబడించడంతో కోర్టులోకి వెళ్లారని వివరించారు. అనంతరం కోర్టు తాళాన్ని పగలగొట్టి లోపలికి చొరబడి బీరువాలోని బ్యాగులో ఉన్న సెల్‌ఫోన్లు, ల్యాప్‌ట్యాప్‌లు తీసుకుని మిగతా పేపర్లను పడేశారని పేర్కొన్నారు.
 
బెంచ్‌ క్లర్క్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని పోలీసులు విచారణ చేపట్టారని తెలిపారు. విచారణలో భాగంగా ఆత్మకూరు బస్టాండ్‌ వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న ఇద్దరు పాత నేరస్తులను అదుపులోకి తీసుకుని, సీసీ కెమెరా దృశ్యాలు సహా పూర్తి ఆధారాలతో కేసు ఛేదించామని వివరించారు. 
 
వీరి నుంచి నిందితులిద్దరిని అరెస్టు చేసి వీరి వద్ద నుంచి ట్యాబ్‌, ల్యాప్‌ట్యాప్‌, 4 సెల్‌ఫోన్లు, 7 సిమ్‌ కార్డులు స్వాధీనం చేసుకున్నామని ఎస్పీ తెలిపారు. కోర్టులో చోరీకి గురైన అన్నింటినీ రికవరీ చేశామన్నారు. ఇద్దరు నిందితులపై 14 పాత కేసులు ఉన్నాయని ఆయన వెల్లడించారు.