1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 15 ఏప్రియల్ 2022 (09:10 IST)

కాకాణి గోవర్థన్ రెడ్డికి మంత్రి పదవి రాగానే నెల్లూరు కోర్టులో దొంగలుపడ్డారు

kakani
నెల్లూరు కోర్టులో దొంగలుపడ్డారు. ఈ దొంగలు కేవలం ఏపీ మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డికి వ్యతిరేకంగా కోర్టులో ఉన్న సాక్ష్యాధారాల బ్యాగును మాత్రమే చోరీచేశారు. అదీ కూడా ఏపీ మంత్రిగా కాకాణి గోవర్థన్ రెడ్డి మంత్రిగా నియమితులైన వెంటనే నెల్లూరు కోర్టులో దొంగలు పడటం గమనార్హం. 
 
గతంలో మంత్రి కాకాణి గోవర్ధన్‌ రెడ్డిపై తెదేపా నేత సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి గతంలో పెట్టిన ఫోర్జరీ కేసుకు సంబంధించిన పత్రాలుగా వాటిని గుర్తించారు. సోమిరెడ్డికి విదేశాల్లో వేల కోట్ల రూపాయల విలువైన ఆస్తులు ఉన్నాయని 2017లో కాకాణి ఆరోపించారు. ఇందుకు సంబంధించి కొన్ని రుజువులను కూడా బయటపెట్టారు. 
 
ఈ ఆరోపణలపై తీవ్రంగా స్పందించిన సోమిరెడ్డి.. నకిలీ పత్రాలు సృష్టించి తనపై అసత్యాలు ప్రచారం చేస్తున్నారని పేర్కొటూ నెల్లూరు రూరల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించగా కాకాణి బయటపెట్టినవి నకిలీ పత్రాలుగా గుర్తించి చార్జిషీటు దాఖలు చేశారు. అందులో కాకాణినిని ఏ-1 నిందితుడిగా పేర్కొన్నారు. 
 
అలాగే, ఆ పత్రాలు సృష్టించిన పసుపులేటి చిరంజీవి అలియాస్ మణిమోహన్‌ను ఎ-2గా పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ కేసు నెల్లూరు నాలుగో ఏడీఎం కోర్టులో విచారణ దశలో ఉంది. ఈ క్రమంలో బుధవారం రాత్రి కోర్టులోకి చొరబడిన దొంగలు ఆ కేసుకు సంబంధించి భద్రపరిచిన డాక్యుమెంట్లు, ల్యాప్‌టాప్, నాలుగు మొబైల్ ఫోన్లను ఎత్తుకెళ్లారు. వాటిలో కొన్ని డాక్యుమెంట్లు ఉండగా వాటిని కోర్టు ప్రాంగణంలోనే పడేశారు. 
 
నెల్లూరులోని నాలుగో ఏడీఎం కోర్టులో జరిగిన చోరీ తీవ్ర చర్చనీయాంశమైంది. కోర్టు ప్రాంగణంలో పడేసిన పత్రాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.