గన్నవరం చేరిన ఉప రాష్ట్రపతి వెంకయ్య... ఏపీ గవర్నర్ స్వాగతం
రాష్ట్రంలో నాలుగు రోజుల పర్యటన సందర్భంగా భారత ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు శనివారం ఉదయం గన్నవరం చేరుకున్నారు. గోవా నుండి ఎయిర్ ఫోర్స్ కు చెందిన ప్రత్యేక విమానంలో శనివారం ఉదయం 11.08 ని.లకు గన్నవరం విమానాశ్రయం చేరుకున్నారు. ఉప రాష్ట్రపతికి రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ శాలువా కప్పి, పుష్ప గుచ్చం అందించి ఘనంగా స్వాగతం పలికారు.
గవర్నర్ కు స్వాగతం పలికిన వారిలో రాష్ట దేవాదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్, మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్, డిజిపి గౌతం సవాంగ్, రాష్ట్ర ప్రభుత్వ పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల వలవన్, ముఖ్యమంత్రి కార్యాలయం ప్రత్యేక కార్యదర్శి రేవు ముత్యాలరాజు, విజయవాడ నగర పోలీస్ కమీషనర్ బి . శ్రీనివాసులు, జిల్లా కలెక్టర్ జె. నివాస్, ప్రోటోకాల్ డైరెక్టర్ బాలసుబ్రహ్మణ్య రెడ్డి, విజయవాడ నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి) ఎల్.శివశంకర్, తదితరులు వున్నారు.
అనంతరం ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు గన్నవరం నుండి బయలుదేరి ఉంగుటూరు మండలం ఆత్కూరు లోని స్వర్ణభారతి ట్రస్ట్ కు బయలుదేరి వెళ్లారు. అక్కడ ఉపరాష్ట్రపతి కుమార్తె ఆధ్వర్యంలో జరిగే స్వర్ణభారతి ట్రస్ట్ కార్యక్రమంలో పాల్గొంటారు. మరో నాలుగు రోజుల పాటు ఆయన విజయవాడ, విశాఖలలో జరిగే కార్యక్రమాలలో పాల్గొంటారు.