ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జె
Last Modified: గురువారం, 23 డిశెంబరు 2021 (22:53 IST)

చిత్తూరు జిల్లాలో దళితులపై దౌర్జన్యం, ఇళ్ళు కూల్చేసి..?

చిత్తూరు జిల్లాలోని రామకుప్పం మండలం క్రిష్ణానగర్‌లో ఉద్రిక్తత నెలకొంది. దళిత కుటుంబానికి చెందిన గంగప్ప అనే వ్యక్తి ఇంటిని కూల్చేశారని ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదు. దీంతో దళితులందరూ కలిసి రామకుప్పం పోలీస్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. అసలేం జరిగిందంటే..

 
అప్పు తీసుకున్న పాపానికి తిరిగి వడ్డీతో సహా చెల్లిస్తామంటున్నా సరే వడ్డీ వ్యాపారస్తులు పట్టించుకోకుండా ఇంట్లోని వారందరిపైనా దాడి చేసి అందరినీ ఇంటి నుంచి బయటకు లాగి పడేశారు. అంతటితో ఆగలేదు. ఒక చిన్నారి కాలు విరగ్గొట్టారు. 

 
కుప్పం నియోజకవర్గం రామకుప్పం మండలం క్రిష్ణానగర్‌కు చెందిన గంగప్ప అనే వృద్థుడు పూట గడవడం కష్టమవ్వడంతో తన కుటుంబం అవసరాల నిమిత్తం కంచిదాసనపల్లికి చెందిన వడ్డీ వ్యాపారస్తుల వద్ద తన పొలాన్ని తాకట్టు పెట్టి మూడు లక్షల రూపాయలు డబ్బును అప్పుగా తీసుకున్నాడు.

 
దీంతో ఆ విలువైన భూమిపై వడ్డీవ్యాపారుల కన్ను పడింది. తీసుకున్న డబ్బుకు వడ్డీ కరెక్టుగా కట్టినా కూడా పొలాన్ని ఎలాగైనా ఆక్రమించుకోవాలన్న ఉద్దేశంతో బెదిరింపులకు గురిచేశారు. నిన్న రాత్రి ఇంట్లోకి ప్రవేశించి విచక్షణారహితంగా కుటుంబ సభ్యులపై దాడి చేశారు. దీంతో తీవ్రగాయాలపాలైన బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

 
రామకుప్పం పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. దీంతో దళిత సంఘాల నేతల దృష్టికి తీసుకెళ్ళారు. దీంతో బాధితులతో కలిసి దళిత సంఘాలు రామకుప్పం పోలీస్టేషన్ ముందు ఆందోళనకు దిగాయి. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది.